Miss Universe India 2025| మిస్ యూనివర్స్ ఇండియా (Miss Universe India 2025) కిరీటాన్ని మణిక విశ్వకర్మ(Manik Vishwakarma) కైవసం చేసుకున్నారు. రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్(Jaipur)లో జరిగిన పోటీల్లో ఆమె విజేతగా నిలిచారు. 2024 మిస్ యూనివర్స్ రియా సింఘా ఈ కిరీటాన్ని దక్కించుకున్నారు. మణిక విశ్వకర్మకు రియా సింఘా కిరీటాన్ని అందించారు. 48 మంది ఈ టైటిల్ కోసం పోటీపడ్డారు. ఇందులో మణిక గెలుపొందారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తాన్య శర్మ ఫస్ట్ రన్నరప్ గా, హర్యానాకు చెందిన మెహక్ ధింగ్రా సెకండ్ రన్నరప్ గా నిలిచారు. అమిషి కౌశిక్ మూడో ప్లేస్ లో నిలిచారు.
ఎవరీ మణిక విశ్వకర్మ?
రాజస్థాన్ లోని శ్రీగంగానగర్ మణికది. ప్రస్తుతం ఆమె ఢిల్లీలో ఉంటున్నారు. పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. ఆమె గత ఏడాది మిస్ యూనివర్స్ రాజస్థాన్ టైటిల్ గెలుచుకున్నారు. ఇలాంటి పోటీల్లో పాల్గొంటున్నప్పటికీ చదువును ఆమె ఏ మాత్రం నిర్లక్ష్యం చేయడం లేదు. ఆమె బహుముఖ ప్రజ్ఙాశాలిగా చెబుతారు. శాస్త్రీయ నృత్యం కూడా ఆమె నేర్చుకున్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్వహించిన బీఐఎంఎస్టీఈసీ సెవోకాన్ లో ఆమె ఇండియాకు ప్రాతినిథ్యం వహించారు. లలిత కళా అకాడమీ , జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ నుంచి కూడా ఆమె ప్రశంసలు పొందారు. తన స్వగ్రామం గంగానగర్ నుంచి తన ప్రయాణం ప్రారంభమైందని ఆమె చెప్పారు. మనలో ఆత్మవిశ్వాసం, ధైర్యం పెంచుకొని ముందుకు సాగాలని ఆమె సూచించారు. తనకు సహాయం చేసినా, అండగా నిలిచిన వారికి ఆమె ధన్యవాదాలు తెలిపారు.న్యూరోనోవా అనే సంస్థను కూడా ఆమె స్థాపించారు. న్యూరోలాజికల్ సమస్యలతో బాధపడేవారికి ఈ సంస్థ సేవలు అందిస్తోంది.