Site icon vidhaatha

Gongidi Sunitha: మిస్ వరల్డ్ పోటీలతో తెలంగాణ పరువు పోయింది : గొంగిడి సునీత

Gongidi Sunitha: మిస్ వరల్డ్ అందాల పోటీలపై వచ్చిన ఆరోపణలతో ప్రపంచ దేశాల్లో తెలంగాణ పరువు పోయిందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత విమర్శించారు. ఆదివారం తెలంగాణ భవన్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళలని గౌరవించే తెలంగాణ గడ్డ మీద విదేశీ మహిళకు అవమానం జరిగిందని..మిస్ వరల్డ్ కాంటెస్టెంట్ మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ చేసిన ఆరోపణలతో సీఎం రేవంత్ రెడ్డి పుణ్యమా అని భారత్ పరువు, తెలంగాణ పరువు అంతర్జాతీయంగా మసకబారిందన్నారు. ప్రపంచ సుందరి పోటీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అంత ప్రాధాన్యత ఇచ్చారని..చివరకు అభాసుపాలయ్యాయని విమర్శించారు. అవమానం జరిగిందంటూ మిస్ ఇంగ్లాండ్ అర్థాంతరంగా తన దేశానికి వెళ్లిపోయిందని..ఇదేనా అతిథులకు ఇచ్చే గౌరవం? అని సునీత మండిపడ్డారు. పోటీల నుంచి వైదొలిగిన మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనను వ్యభిచారిలా..ఆటబొమ్మలుగా చూశారని మాగీ వాపోయిందని..ఆమెకు జరిగిన అవమానానికి ఎవరు సమాధానం ఇస్తారని ప్రశ్నించారు. మిస్ ఇంగ్లాండ్‌ను అవమానపరిచిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 

అందాల పోటీల చుట్టునే సీఎం..మంత్రులు

అందాల పోటీల చుట్టూ సీఎం, మంత్రులు తిరిగారని..అందాల పోటీల ప్రచారంలో సీఎం, మంత్రుల ఫోటోలు ఎందుకు? అని ప్రశ్నించారు. తడిసిన వడ్లు కొనడం సాధ్యం కాదు, గురుకులాల సమస్యలు పరిష్కరించడం చేతకాదు కాని..సీఎం ఆరుసార్లు అందాల పోటీలకు వెళతారా? అని విస్మయం వ్యక్తం చేశారు. మహిళలను అవమానిస్తే పెట్టుబడులు వస్తాయా? అని…అసలు అందాల పోటీలతో పెట్టుబడులు వస్తాయా? ఇంతకన్నా నీచం ఇంకొకటి ఉంటుందా? అని సునీత విమర్శించారు. రేవంత్ రెడ్డి ఓవైవు అప్పులు పుట్టడం లేదంటూ ఇంకో వైపు అందాల పోటీలతో పెట్టుబడులు వస్తాయి అని అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారన్నారు. అందాల పోటీలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో నిర్వాహకులపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. హ్యూమన్ రైట్స్ కమిషన్‌కు ఈ ఘటనపై ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఫార్ములా వన్ రేసుతో 700 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని..కేసీఆర్ హయాంలో మహిళలకు గౌరవం లభించిందని..బతుకమ్మ పండగను రాష్ట్ర పండగ గుర్తింపు ఇచ్చామని సునీత తెలిపారు. అందాల పోటీల తరహాలో కేసీఆర్ ప్రభుత్వం మహిళలను దిగజార్చే పనులు చేయలేదన్నారు. పరువు తీసే పనులు ఇప్పటికైనా మానండని హితవు పలికారు.

Exit mobile version