Mumbai Monorail| భారీ వర్షాల ఎఫెక్ట్.. మధ్యలో ఆగిపోయిన రెండు మోనోరైళ్లు

విధాత : ముంబైలో కురుస్తున్న భారీ వర్షాల ఎఫెక్ట్ (Heavy Rains Effect) తో రెండు మోనో రైళ్లు(Mumbai Monorails) ట్రాక్ మధ్యలోనే అర్ధాంతరంగా ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ముంబైలోని చెంబూర్‌లో మైసూర్ కాలనీ వద్ద ట్రాక్ మధ్యలో మోనో రైలు అకస్మాత్తుగా నిలిచిపోయింది. దీంతో రైలులో కరెంటు లేక.. ఏసీలు పనిచేయక ఊపిరి ఆడకపోవడంతో ప్రయాణికులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. సమాచారం అందుకున్నసహాయక బృందాలు హుటాహుటిన వచ్చి రైళ్ల కిటికీలు పగలగొట్టి రెండు రైళ్లలో చిక్కుకుపోయిన 782 మంది ప్రయాణికుల(Passengers Rescue)ను సురక్షితంగా కాపాడారు. మొదటి రైలులో ఉన్న 582 మందిని స్నోర్కెల్ నిచ్చెన సహాయంతో బయటకు తీసుకొచ్చారు. రెండో రైలులో వారిని సిబ్బంది వాడాలా స్టేషన్ కు తిరిగి తీసుకు రాగలిగారు. ఊపిరాడక సొమ్మసిల్లిన వారిని ఆసుపత్రులకు తరలించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవిస్(CM Devendra Fadnavis)దీనిపై విచారణకు ఆదేశించారు.

ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ మోనో రైళ్లు అకస్మికంగా ఆగిపోవడంపై విచారణ చేసింది. సాధారణంగా ఒక మోనో రైలుకు 104 మెట్రిక్ టన్నుల బరువు మోసే సామర్ధ్యం ఉండగా..ప్రయాణికుల సంఖ్య పెరగడంతో బరువు 109 నెలలకు చేరుకుందని వెల్లడించింది. అదనపు బరువు కారణంగా పవర్ రైలు.. కరెంట్ కలెక్టర్ మధ్య ఉండే కనెక్షన్ విరిగిపోవడంతో రైలుకు విద్యుత్ సరఫరా ఆగిపోయి నిలిచిపోయినట్లు పేర్కొంది.