- వరుసగా కేదార్, సంజీవరెడ్డి, రాజలింగం మృతి
- కేటీఆర్ కోరితే విచారణ జరిపిస్తామంటూ వ్యాఖ్య
- రాజకీయ ఎజెండా పైకి వరుస మృతి సంఘటనలు
- తీవ్ర దుమారానికి దారితీసిన సీఎం వ్యాఖ్యలు
విధాత: ఇప్పుడిప్పుడే మానుతుందనుకున్న భూపాలపల్లి రాజలింగం హత్య సంఘటన గాయం మళ్ళీ రేగింది. మరో ఇద్దరు వ్యక్తులు న్యాయవాది సంజీవరెడ్డి, వ్యాపారి కేదార్ ఆకస్మిక మరణాలను జోడించుకుని మరోసారి ఎజెండా పైకి చేరి రాజకీయ రచ్చకు దారితీస్తుంది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన భూపాలపల్లి కౌన్సిలర్ భర్త రాజలింగమూర్తి దారుణ హత్య నేపథ్యంలో బీఆరెస్ పై వచ్చిన ఆరోపణలు సద్దుమణిగాయనుకుంటున్న తరుణంలో ఢిల్లీ వేదికగా సీఎం రేవంత్ పేల్చిన బాంబు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఒక్క రాజలింగం హత్యే కాకుండా ఇటీవల రాష్ట్రంలో జరిగిన మూడు వరుస సంఘటనల వెనుక ఉన్న అదృశ్యశక్తి ఎవరంటూ సీఎం ప్రశ్నించడం హాట్ టాపిక్ గా మారింది. రాజలింగం హత్యకు ముందు న్యాయవాది గంటా సంజీవరెడ్డి గుండెపోటుతో ఆకస్మిక మృతి చెందడం, దుబాయిలో సినీ నిర్మాత కేదార్ అనుమానాస్పద మృతి సంఘటనలను సీఎవ తన చిట్ చాట్ లో ప్రస్తావించారు. కేటీఆర్ కోరితే ఈ మూడు సంఘటనలపై విచారణ చేస్తామంటూ ముక్తాయింపు ఇవ్వడం కొసమెరుపు.
మూడు సంఘటనలో వెంటాడిన మృత్యువు
ముగ్గురి మరణాల వెనుక ఉన్న అదృశ్య శక్తి ఎవరంటూ సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించడం అత్యంత ప్రాధాన్యతగా మారింది. ఈ ముగ్గురు మృతులతో ప్రత్యక్షంగా, పరోక్షంగా మాజీ మంత్రి కేటీఆర్ తో సంబంధాలున్నాయంటూ ఆయన గుర్తుచేయడం గమనార్హం. దీంతో ఈ సంఘనలకు మరోసారి ప్రాధాన్యత చేకూరింది. భూపాలపల్లిలో హత్యకు గురైన నాగవెల్లి రాజలింగమూర్తి కాళేశ్వర్యం కుంగుబాటుపై కేసు వేసిన వ్యక్తి, ఆకస్మికంగా మృతి చెందిన సంజీవరెడ్డి ఈ కేసును వాదించిన న్యాయవాది, ఇక దుబాయిలో చనిపోయన కేదార్ సినీ నిర్మాత, కేటీఆర్ కు సన్నిహిత మిత్రుడని చెబుతున్నారు. పైగా రాడిసన్ పబ్ లో పట్టుబడిన డ్రగ్స్ కేసులో నిందితునిగా ఉన్నారు. రేపు కేసు విచారణ అనగా రాజలింగమూర్తి హత్యకు గురయ్యారు. కేసు వాదించే న్యాయవాది గుండెపోటుతో చనిపోయారు. త్వరలో విచారణకు వస్తున్న డ్రగ్స్ కేసు నిందితుడు కేదార్ మృతి అదే విధంగా జరిగింది. దీంతో ఈ వరుస సంఘటనల వెనుక అదృశ్య శక్తి ఉందంటూ సీఎం అనుమానాలు వ్యక్తం చేయడం గమనార్హం.
మళ్లీ రాజకీయ తెరపైకి రాజలింగం హత్య
ఈ ముగ్గురిలో ఈ నెల 19న హత్యకుగురైన రాజలింగమూర్తి కాళేశ్వరం కుంగుబాటుపై భూపాలపల్లి కోర్టులో కేసు వేసిన విషయం తెలిసిందే. కేసీఆర్, హరీష్ రావు, నిర్మాణ సంస్థతో పాటు తదితరులను ఈ కేసులో నిందితులుగా పేర్కొన్నారు. ఈ కేసు పై స్థానిక కోర్టుకు కేసీఆర్, హరీష్ రావు హాజరుకావాలంటూ ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో రేపు విచారణ అనగా లింగమూర్తి దారుణ హత్యకు గురయ్యారు. హత్యకు ప్రధాన కారణం స్థానికంగా ఉన్న భూ వివాదమని తెరపైకి వచ్చింది. తదుపరి రాజకీయ హస్తముందా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. హత్య పై లింగమూర్తి భార్య, కుటుంబం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు ఈ హత్యకు స్ధానికులు కొందరి పేర్లు చెబుతూనే బీఆరెస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ల పాత్ర ఉందంటూ ఆరోపించడం తీవ్ర కలకలం సృష్టించింది. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్పందిస్తూ సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు. రాజలింగమూర్తి కాళేశ్వరం ప్రాజెక్టు పై కేసు వేసినందున నిజాయితీగా దర్యాప్తు చేయాలంటూ సూచించారు.
ముందుగా స్పందించిన మంత్రి కోమటిరెడ్డి
రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం రాజలింగం హత్యపై తీవ్రంగా స్పందించారు. రాజలింగం కేసీఆర్, హరీష్ రావుల పై కేసు వేసినందున ఈ హత్య వెనుక వారి పాత్ర ఉందనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలు పెద్ద దుమారాన్ని సృష్టించాయి. మంత్రి ఆరోపణలపై కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లు మాత్రం మౌనం వహించారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర రమణారెడ్డి మాత్రం తనకు సంబంధం లేదంటూ ఏ విచారణకైనా సిద్ధమంటూ ప్రకటించారు.
నిందితుల్లో బీఆరెస్ నాయకుడు
పోలీసులు మాత్రం ప్రధానంగా రాజలింగం హత్యకు భూ వివాదామే కారణమని, ఇతర రాజకీయ కారణాలపై విచారణ చేస్తున్నామంటూ చెప్పారు. ఈ హత్యలో 10 మంది నిందితులుగా గుర్తించి ఏడుగురిని అరెస్టు చేశారు. ముగ్గురు పరారీలో ఉన్నట్లు ప్రకటించారు. అయితే ఈ కేసులో ఎ 8గా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు నిందితునిగా ఉన్నారు. హరిబాబు బీఆరెస్ కు చెందిన నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గండ్ర అనుచరునిగా ఉన్నారు. ఈ కారణంగా ఈ హత్య వెనుకు బీఆరెస్ హస్తముందా? అనే అనుమానాలున్నాయి.
రేవంత్ వ్యాఖ్యలతో రాజకీయ దుమారం
రాజలింగం హత్య కేసు నిందితులెవరో తేలిపోయిందనుకుంటున్న సమయంలో సీఎం రేవంత్ ఢిల్లీ వేదికగా వ్యక్తం చేసిన అభిప్రాయాలిప్పుడు రాజకీయప్రాధాన్యతను సంతరించుకున్నాయి. రాజలింగం హత్యతో పాటు, సంజీవ రెడ్డి, కేదారిల మృతిపై ఆయన మాట్లాడారు. కేటీఆర్ బిజినెస్ పార్ట్నర్ కేదార్ దుబాయిలో అనుమానాస్పదంగా మృతి చెందారని, దీనిపై కేటీఆర్ ఎందుకు స్పందించలేదన్నారు. ఈ సంఘటనపై విచారణ కోరతారా లేదా అని నిలదీశారు. రాష్ట్రంలో తాజాగా మూడు అనుమానాస్పద మరణాలు జరిగాయన్నారు. కేదార్, కాళేశ్వరం కేసులు వాదిస్తున్న న్యాయవాది సంజీవ్ రెడ్డి, కేసు వేసిన లింగమూర్తి మరణాలపై కేసీఆర్ ఎందుకు విచారణ కోరడం లేదని ప్రశ్నించారు. తమకు ఫిర్యాదు చేస్తే విచారణ చేపడతామని సీఎం స్పష్టం చేశారు. ఒక మాజీ ఎమ్మెల్యే దుబాయ్ లోనే ఉన్నారంటూ అతను ఎవరని ప్రశ్నించారు. త్వరలో డ్రగ్స్ కేసు విచారణకు రాబోతోందని ఈ సమయంలో నిందితుడిగా ఉన్న కేదార్ మృతి అనుమానాలకు తావిస్తుందన్నారు. దీంతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికలు, కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ అవినీతి,ఫోన్ ట్యాపింగ్, ఫిరాయింపులు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్ తీరు పై విమర్శలు చేశారు. తాజాగా సీఎం విమర్శలపై బీఆరెస్, బీజేపీ ఏ విధంగా స్పందిస్తుందోననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
-(రవి సంగోజు)