హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ప్రతి రోజు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తున్నారు. అయితే మంగళవారం నిర్వహించిన పరీక్షను కేవలం గంటన్నర మాత్రమే నిర్వహించారు. ఎందుకంటే.. సైన్స్ పరీక్షలో భాగంగా ఫిజిక్స్, జీవశాస్త్రం పేపర్‌కు వేర్వేరుగా పరీక్షలు నిర్వహించాలని ఎస్సెస్సీ బోర్డు నిర్ణయించింది.
ఆ నిర్ణయం మేరకు మంగళవారం ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు గంటన్నర పాటు ఫిజిక్స్ ఎగ్జామ్ నిర్వహించారు. 40 మార్కులకు పరీక్ష నిర్వహించారు. ఇక పార్ట్ -బీ(బిట్ పేపర్) ను ఆఖరి 15 నిమిషాల ముందు(10:45 గంటలకు) నిర్వహించారు. బుధవారం కూడా ఈ విధంగానే జీవశాస్త్రం పరీక్షను నిర్వహించనున్నారు. అయితే ఈ రెండు పేపర్లను స్కూల్ అసిస్టెంట్(ఫిజిక్స్), స్కూల్ అసిస్టెంట్(బయాలజీ) టీచర్లు మూల్యాంకనం చేస్తారు. కానీ ఫలితాలు ప్రకటించే సమయంలో మాత్రం రెండు పేపర్ల మార్కులను కలిపి ఒకే పేపర్‌గా పరిగణించి వెల్లడించనున్నారు.