లక్నో : ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాస్‌గంజ్ పరిధిలో భక్తులతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ ప్రమాదవశాత్తు రోడ్డు పక్కనే ఉన్న చెరువులో పడిపోయింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గల్లంతు అయ్యారు. మృతుల్లో ఏడుగురు చిన్నారు ఉన్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన వారిని వెలికితీసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. అయితే భక్తులంతా మాఘ పూర్ణిమను పురస్కరించుకుని గంగా నదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు బయల్దేరినట్లు పోలీసులు తెలిపారు. అంతలోనే ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు.
ఈ ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం భరోసా ఇచ్చారు.