జైపూర్ : రాజస్థాన్ కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా నీట్‌కు ప్రిపేరయ్యే ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. దీంతో విద్యార్థుల ఆత్మహత్యలు 29కి చేరాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన నిషా యాదవ్ (21) అనే విద్యార్థిని ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని ఔరియా జిల్లాకు చెందిన నిషా అనే విద్యార్థిని, కోటాలోని మహవీర్ నగర్ ప్రాంతంలో ఓ హాస్టల్‌లో ఉంటూ నీట్ ఎగ్జామ్‌కు ప్రిపేర్ అవుతోంది.
అయితే నవంబర్ 29వ తేదీన నిషా తండ్రి ఆమెకు ఫోన్ చేయగా, స్పందించలేదు. గురువారం కూడా ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన నిషా తండ్రి.. హాస్టల్ యాజమాన్యానికి ఫోన్ చేశారు. ఆమె ఉంటున్న గది తలుపులు పగలగొట్టి చూడగా, ఫ్యాన్‌కు ఉరేసుకున్నట్లు యాజమాన్యం గుర్తించింది.
దీంతో హాస్టల్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, సోమవారం కూడా ఓ నీట్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్‌కు చెందిన 20 ఏళ్ల ఫౌరీద్ హుస్సేన్ తన రూమ్‌లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
వారం రోజుల వ్యవధిలోనే ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మొత్తంగా తాజా ఘటనతో కలిసి ఈ ఏడాది ఇప్పటి వరకూ 29 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. రాజస్థాన్ పోలీసుల వివరాల ప్రకారం.. 2022లో 15 మంది, 2019లో 18 మంది, 2018లో 20 మంది, 2017లో ఏడుగురు, 2016లో 17 మంది, 2015లో 18 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. అయితే, కరోనా కారణంగా కోచింగ్ సెంటర్లు మూతపడడంతో 2020, 2021 ఏడాదిల్లో కోటాలో ఒక్క విద్యార్థి కూడా ఆత్మహత్య చేసుకోలేదు.