రాహుల్‌పై పోటీ చేస్తున్న వ‌య‌నాడ్ బీజేపీ అభ్య‌ర్థిపై 242 క్రిమిన‌ల్ కేసులు

కేర‌ళ‌లోని వ‌య‌నాడ్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి సిట్టింగ్ ఎంపీ రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున బ‌రిలోకి దిగిన విష‌యం తెలిసిందే.

  • Publish Date - March 30, 2024 / 06:40 AM IST

తిరువ‌నంత‌పురం : కేర‌ళ‌లోని వ‌య‌నాడ్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి సిట్టింగ్ ఎంపీ రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున బ‌రిలోకి దిగిన విష‌యం తెలిసిందే. రాహుల్ గాంధీపై బీజేపీ అభ్య‌ర్థిగా కేర‌ళ చీఫ్ కే సురేంద్ర‌న్ పోటీ చేస్తున్నారు. కోజికోడ్‌కు చెందిన‌ కే సురేంద్ర‌న్‌పై 242 క్రిమిన‌ల్ కేసులు న‌మోదైన‌ట్లు ఇటీవ‌లే అధికారికంగా వెల్ల‌డించారు. ఈ విష‌యాన్ని బీజేపీకి సంబంధించిన ఓ వార్తా మాధ్య‌మంలో మూడు పేజీల్లో త‌న వివ‌రాల‌ను స‌మ‌గ్రంగా వెల్ల‌డించారు సురేంద్ర‌న్.


అయితే సురేంద్ర‌న్‌పై అత్య‌ధికంగా శ‌బ‌రిమ‌ల వివాదానికి సంబంధించి న‌మోదైన‌ట్లు బీజేపీ స్టేట్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ జార్జ్ కురియ‌న్ తెలిపారు. శబరిమల నిరసనలకు సంబంధించి 237 కేసులు న‌మోదు కాగా, కేరళలో వివిధ ఆందోళనలకు సంబంధించి ఐదు నమోదయ్యాయని కురియన్ చెప్పారు.శబరిమలలోకి యువతుల ప్రవేశానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో సురేంద్రన్‌ చురుగ్గా పాల్గొన్నారు. ఇక సురేంద్ర‌న్‌పై న‌మోదైన ప‌లు కేసులు కోర్టు ప‌రిధిలో ఉన్నాయి. ఎర్నాకులం నుంచి పోటీ చేస్తున్న కేఎస్ రాధాకృష్ణ‌న్‌పై దాదాపు 211 క్రిమిన‌ల్ కేసులు న‌మోదు అయ్యాయి.


కే సురేంద్ర‌న్ 2019 ఎన్నిక‌ల్లో ప‌త్త‌నంతిట్ట నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మూడు స్థానానికి ప‌రిమిత‌మ‌య్యారు. 2016 కేర‌ళ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మంజేశ్వ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నిక‌ల్లో 89 ఓట్ల స్వ‌ల్ప తేడాతో ఓట‌మి చ‌విచూశారు. 2019 ఉప ఎన్నిక‌ల్లో కూడా పోటీ చేశారు కానీ ఓడిపోయారు. 2020లో బీజేపీ కేర‌ళ అధ్య‌క్షుడిగా సురేంద్ర‌న్ నియ‌మితుల‌య్యారు.

Latest News