Site icon vidhaatha

కేర‌ళ‌లో విషాదం.. త‌ల్లి, భార్య గొంతు కోసి ఆత్మ‌హ‌త్య చేసుకున్న వ్యాపార‌వేత్త‌


విధాత‌: కేర‌ళ‌లోని కాస‌ర‌గోడ్ జిల్లా అవికారాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు తమ నివాసంలో శవమై కనిపించారు. మృతుల‌ను సూర్య వాచ్ వ‌ర్క్ య‌జ‌మాని సూర్యప్రకాశ్‌, ఆయ‌న భార్య కే గీత (59) , ఆయ‌న త‌ల్లి కే లీల (94)గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. సూర్య‌ప్ర‌కాశ్ ఇంట్లోని కిచెన్‌లో ఉరేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. త‌ల్లి, భార్య వేర్వేరు గ‌దుల్లో గొంతులు తెగి ర‌క్త‌పు మ‌డుగుల్లో విగ‌త జీవులుగా క‌నిపించారు.


సూర్య ప్రకాశ్ తొలుత భార్య‌, త‌ల్లిని గొంతుకోసి చంపేసి అనంత‌రం తాను వేరేగ‌దిలో ఉరేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకొని ఉంటాడ‌ని పోలీసులు ప్రాథ‌మికంగా నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. గ‌దిలో పోలీసులు సూసైడ్ నోటును స్వాధీనం చేసుకున్నారు. తమ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న‌ట్టు సూర్య ప్ర‌కాశ్ నోట్‌లో పేర్కొన్నారు.


సూర్య ప్ర‌కాశ్ కుమారుడు అజ‌య్ ప్ర‌కాశ్‌ శ‌నివారం ఉద‌యం తండ్రికి ఫోన్ చేశారు. అయితే, ఎంత‌కు స‌మాధానం రాక‌పోవ‌డంతో త‌న స్నేహితుడిని ఇంటికి పంపించి వివ‌రాలు తెలుసుకోవాల‌ని కోరాడు. అత‌డు ఇంటికి వెళ్లి చూడ‌గా, ముగ్గురు విగ‌త జీవులుగా క‌నిపించారు. స‌మాచారం అందుకున్న పోలీసులు మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. పోలీసులు కేసు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు.

Exit mobile version