Dowry Deaths | వరకట్నాన్ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చినప్పటికీ వరకట్న వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ వేధింపులు భరించలేక ఎంతో మంది గృహిణులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. వరకట్న వేధింపులు తట్టుకోలేక 2017 నుంచి 2021 మధ్య కాలంలో 35,493 మంది మహిళలు ఆత్మహత్య చేసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది.
ఈ మేరకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా నిన్న రాజ్యసభలో వెల్లడించారు. 2017 నుంచి 2021 మధ్యకాలంలో దేశ వ్యాప్తంగా ప్రతి రోజు 20 మంది మహిళలు సూసైడ్ చేసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే రోజుకు 6 మంది చొప్పున ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.
2017లో 7,466 మంది, 2018లో 7,167, 2019లో 7,141, 2020లో 6,966, 2021లో 6,753 మంది మహిళలు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే అత్యధికంగా 11,874 మంది మహిళలు సూసైడ్ చేసుకున్నట్లు పేర్కొన్నారు. బీహార్‌లో 5,354 మంది, మధ్యప్రదేశ్‌లో 2,859, వెస్ట్ బెంగాల్‌లో 2,389, రాజస్థాన్‌లో 2,244 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు అజయ్ మిశ్రా తెలిపారు.