Site icon vidhaatha

ఉత్తరాఖండ్‌లో హింస.. న‌లుగురు దుర్మ‌ర‌ణం


విధాత‌: ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ న‌గ‌రంలో అక్రమంగా నిర్మించిన మదర్సా, ప‌క్క‌నే ఉన్న మసీదు కూల్చివేత గురువారం తీవ్ర హింస‌కు దారితీసింది. ఈ హింసాకాండ‌లో న‌లుగురు దుర్మ‌ర‌ణం చెందారు. మ‌రో 250 మంది వ‌ర‌కు గాయ‌ప‌డ్డారు. పెద్ద ఎత్తున వాహ‌నాల‌కు ఆందోళ‌న‌కారులు నిప్పు పెట్టారు. భారీగా ఆస్తిన‌ష్టం సంభ‌వించింది. అల్లర్లను అదుపుచేసేందుకు షూట్-ఎట్-సైట్ ఆదేశాలు జారీ చేశారు. నగరవ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్ సేవలు పూర్తిగా బంద్‌చేశారు. విద్యా సంస్థ‌ల‌కు సెల‌వులు ప్ర‌క‌టించారు. న‌గ‌రవ్యాప్తంగా భారీ పోలీసులు బందోబ‌స్తు ఏర్పాటుచేశారు.


కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ అధికారుల బృందం, పోలీసులతో కలిసి గురువారం అక్ర‌మ నిర్మాణాలు మదర్సా, మసీదును జేసీబీలో కూల్చేందుకు ఘ‌ట‌నాస్థ‌లికి చేరాయి. ఈ చర్యకు హల్ద్వానీలోని వన్‌భుల్‌పురా ప్రాంతంలోని నివాసితుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. బుల్‌డోజర్‌తో నిర్మాణాలను ధ్వంసం చేయడంతో ఆగ్రహించిన స్థానికులు, మహిళలతో సహా వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు.


బారికేడ్లను బద్దలు కొట్టి పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. పెద్ద సంఖ్య‌లో రోడ్ల‌పైకి వ‌చ్చిన ఆందోళ‌న‌కారులు పోలీసులు, మున్సిపల్ కార్మికులు, జర్నలిస్టులపై రాళ్లు విసిరారు. ఈ ఘర్షణలో 50 మంది పోలీసులకు గాయాలయ్యాయి. పోలీస్ స్టేషన్ బయట వాహనాలకు నిప్పు పెట్టడంతో హింస పెరిగింది.


“పోలీసులు ఎవరినీ రెచ్చగొట్టలేదు. అయినప్పటికీ, వారిపై ఆందోళ‌న‌కారులు దాడి చేశారు, ఒక పోలీసు స్టేషన్‌ను ధ్వంసం చేశారు. అల్లరిమూకలు స్టేషన్ లోపల పోలీసు సిబ్బందిని కాల్చడానికి ప్రయత్నించారు” అని నైనిటాల్ జిల్లా మేజిస్ట్రేట్ వందనా సింగ్ చెప్పారు. కోర్టు ఆదేశాల తర్వాత కూల్చివేతలను నిర్వహించడానికి ఒక బృందాన్ని ఆ ప్రాంతానికి పంపినట్టు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. ఆ ప్రాంతంలోని “సంఘ వ్యతిరేకులు” పోలీసులతో ఘర్షణ పడ్డారని పేర్కొన్నారు. శాంతిభద్రతలను పునరుద్ధరించేందుకు అదనపు పోలీసులు, కేంద్ర బలగాలను మోహరిస్తున్నారు.


ముందుజాగ్రత్త చర్యగా హల్ద్వానీ అంతటా కర్ఫ్యూ విధించారు. ప్రభావిత ప్రాంతాల్లో దుకాణాలు, పాఠశాలలు మూతపడ్డాయి. అరాచ‌క‌శ‌క్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పలువురు తలకు, ముఖానికి గాయాలవడంతో క్షతగాత్రులు ద‌వాఖాన‌లో చికిత్స పొందుతున్నారు.


కూల్చివేతను నిలిపివేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై ఉత్తరాఖండ్ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. అయితే కోర్టు ఉపశమనం కల్పించకపోవడంతో కూల్చివేత కొనసాగింది. ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 14న జరగనుంది.

Exit mobile version