లక్నో : గుండెపోటు.. ఎవరికి, ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. ఒకప్పుడు వయసు పైబడ్డ వారికి, శరీరంలో కొవ్వు అధికంగా ఉన్నవారు గుండెపోటుకు గురయ్యేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అప్పుడే పుట్టిన పసికందు నుంచి మొదలుకుంటే పండు ముసలి వయసున్న వారి దాకా గుండెపోటు పట్టిపీడిస్తోంది. అనేక మందిని బలి తీసుకుంటోంది గుండెపోటు.
మొబైల్ ఫోన్‌లో కార్టూన్స్ చూస్తూ ఓ ఐదేండ్ల పాప గుండెపోటుకు గురై చనిపోయింది. ఆ సమయంలో తన తల్లి పక్కనే బెడ్‌పై ఉంది చిన్నారి. ఫోన్ తన చేతిలో నుంచి జారవిడిచి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దీంతో అప్రమత్తమైన తల్లి తన బిడ్డను సమీప ఆస్పత్రికి తీసుకెళ్లగా, గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ అమ్రోహ జిల్లాలోని హసన్‌పూర్ కొత్వాలి పరిధిలోని హథికేడ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది.
గత రెండు నెలల కాలంలో అమ్రోహ, బిజ్నూర్ జిల్లాల్లో కనీసం డజన్ మంది గుండెపోటుతో చనిపోయారు. ఇందులో చిన్నారులు, పెద్దలు ఉన్నట్లు అధికారుల ద్వారా తెలిసింది. క్రికెట్ ఆడుతూ 16 ఏండ్ల కుమార్ హార్ట్ స్ట్రోక్‌తో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన అమ్రోహ్‌లో డిసెంబర్ 31న చోటు చేసుకుంది. బిజ్నూర్ జిల్లాలో 12 ఏండ్ల శిప్రా కూడా తరగతి గదిలో గుండెపోటుకు గురై చనిపోయింది. ఈ ఘటన డిసెంబర్ 9న చోటు చేసుకుంది. అయితే చలికాలంలో గుండెపోటు వస్తుందని, ఎందుకంటే ఆక్సిజన్ లెవల్స్ తగ్గిపోయి, బీపీ పెరగడంతో రక్తం గడ్డ కట్టే అవకాశం ఉంది. తద్వారా గుండెపోటు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.