Site icon vidhaatha

నిరుద్యోగులకు శుభవార్త.. ఉద్యోగాల భర్తీకి తొలిగిన అన్ని అడ్డంకులు!

విధాత‌: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు గ్రూప్‌-1లో మరో 60 పోస్టులు పెంచింది. దీంతో గతంలో ఇచ్చిన 503 పోస్టులను కలిపి 563కు పెరిగింది. 503 పోస్టులకు 2022 అక్టోబర్‌లో ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించింది. ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో గత ఏడాది జూన్‌లో మరోసారి ప్రిలిమ్స్‌ నిర్వహించింది. ఆ పరీక్షలో నిబంధనలు పాటించలేదనే కారణంతో హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ దాన్ని రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని ఆదేశించింది. దీన్నీ సర్వీస్‌ కమిషన్‌ డివిజన్‌ బెంచ్‌లో సవాల్‌ చేసినా అక్కడ కూడా కమిషన్‌కు చుక్కెదురైంది.


దీంతో సర్వీస్‌ కమిషన్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. సుప్రీం కోర్టులో ఆ వ్యాజ్య నడుస్తుండటంతో తిరిగి పరీక్ష నిర్వహిస్తారా? కొత్తగా అననుమతిచ్చిన 60 పోస్టులకు అనుబంధ నోటిఫికేషన్‌ విడుదల చేస్తారా? అన్న అంశాలపై నిరుద్యోగుల్లో అయోమయం నెలకొన్నది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. గతంలో నిర్వహించిన పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి నిన్న ప్రకటించారు. వయో పరిమితి సడలింపు ఇచ్చి అందరికీ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అంటే సుప్రీంకోర్టులో గ్రూప్‌-1 పై వేసిన పిటిషన్‌ను ప్రభుత్వం వెనక్కి తీసుకోనున్నట్టు స్పష్టమైంది.


చరిత్రలో ఇలాంటి అవకాశం మళ్లీ రాకపోవచ్చు


ఉమ్మడి రాష్ట్రంలో అయినా, 90 దశకంలోనూ, ఆ తర్వాత పరిణామాల్లోనూ ఇన్ని పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్‌ రాలేదని నిపుణులు చెబుతుతన్నారు. చరిత్రలో ఇలాంటి అవకాశం రాదంటున్నారు. గ్రూప్‌-1 ప్రిపేర్‌ అయ్యేవాళ్లలో ఎక్కువశాతం మంది డిప్యూట్‌ కలెక్టర్‌, డీఎస్పీ, సీటీవో పోస్టులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. యూపీఎస్సీకి సన్నద్దం అయ్యేవాళ్లు కూడా అక్కడ సక్సెస్‌ కాకపోతే గ్రూప్‌-1పై దృష్టి సారిస్తారు. పోస్టుల పరంగా చూస్తే ఈ మూడు ఉద్యోగాలు దక్కించుకోవాలంటే పోటీ పడనున్న అభ్యర్థుల సంఖ్యగా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి టాప్‌ 15లోనే ఉంటేనే ఈ ఉద్యోగాలు దక్కుతాయని పోటీ పరీక్షల నిపుణులు నిరుద్యోగ అభ్యర్థులకు చెబుతుంటారు.


కానీ ప్రభుత్వం పెంచిన పోస్టుల వల్ల తాజాగా గ్రూప్‌-1లో డిప్యూట్‌ కలెక్టర్‌ పోస్టులు సుమారు 45, డీఎస్పీ పోస్టులు దాదాపు 115 వరకు ఉన్నాయి. అర్హత ఉన్న యువతకు ఇది అద్భుతమైన అవకాశమని సూచిస్తున్నారు. ఈ పోస్టులు సాధిస్తే వాళ్ల వయసు బట్టి యువత సొంత రాష్ట్రంలో ఐఏఎస్‌, ఐపీఎస్‌లుగా సొంతరాష్ట్రంలోనే 15 ఏళ్లు అయినా పనిచేసే అవకాశం లభిస్తుందని అంచనా వేస్తున్నారు. అలాగే సీటీవో ఉద్యోగాలు 40 ఉన్నాయి.


తాజా పోస్టుల్లో యువత కలలు కంటున్న డిప్యూటీ కలెక్టర్‌, డీఎస్పీ, సీటీవో వంటి పోస్టులకు గతంలో వలె టాప్‌ 15లోనే ఉండాలనే ఒత్తిడి ఉండదు. రోస్టర్‌ పాయింట్స్‌ వంటివి ఉంటాయి. అయినప్పటికీ గతంతో పోలిస్తే జీవితంలో మంచి స్థిరపడాలనుకే వారికి నిరుద్యోగులకు ఇంతటి మహాద్భత అవకాశం మళ్లీ రాదంటున్నారు. అందుకే ముఖ్యమంత్రి సూచించినట్టు పరీక్ష తేదీల గురించి ఆలోచించకుండా పరీక్షల కోసం సన్నద్ధం కావాలని పోటీ పరీక్షల నిపుణులు సూచిస్తున్నారు.


ఫలితాలను వెల్లడికి మార్గం సుగమం


ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్షల రద్దుతో సీరియస్‌గా ప్రిపేర్‌ అయిన నిరుద్యోగులు నైరాశ్యంలో కూరుకుపోయారు. కొంతమంది సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగాలకు వెళ్లిపోయారు. ప్రభుత్వం గతంలోఇచ్చిన వాగ్దానం మేరకు వారికి భరోసా కల్పించింది. దీంతో అలాంటి వారంతా మళ్లీ ప్రిపరేషన్‌ మొదలుపెట్టడానికి నమ్మకాన్ని కలిగించింది. పరీక్షలు పారదర్శకంగా నిర్వహించానికి ముందుగా సర్వీస్‌ కమిషన్‌ను ప్రక్షాళన చేసింది. ఉద్యోగాల భర్తీకి అడ్డంకిగా ఉన్నమహిళలకు సమాంతర రిజర్వేషన్లపై గత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం తాత్సారం చేయడం వల్ల నియామకబోర్డులు ఫలితాలు వెల్లడించడానికి అడ్డంకిగా మారింది.


దీనిపై ప్రస్తుతం ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. దానికి అనుగుణంగా సీఎస్‌ ఆదేశాలు జారీ చేసింది. దీంతో సమాంతర రిజర్వేషన్ల కారణంగా నిలిచిపోయిన ఫలితాలను వెల్లడించడానికి మార్గం సుగమం అయ్యింది. టీఎస్‌పీఎస్సీ సహా గురుకుల నియామకబోర్డులతో పాటు వివిధ బోర్డులు ఫలితాలు వెల్లడించడానికి కసరత్తు చేస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయంపై నిరుద్యోగ అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version