విధాత: ధరణిలో పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం వేగంగా జరుగుతోంది. మార్చి 1 నుంచి 9వ తేదీ వరకు రాష్ట్రప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ఈ మేరకు దరఖాస్తుల పరిష్కారం కోసం కలెక్టర్ల వద్ద కేంద్రీకృతమైన అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం తాసీల్దార్లకు, ఆర్డీఓలకు, అడిషనల్ కలెక్టర్లకు బదిలీ చేసింది. అధికారాలు బదిలీ చేసిన ప్రభుత్వం తాసీల్దార్లు వారం రోజుల్లో సమస్యను పరిష్కరించాలని టైమ్‌బాండ్ పెట్టింది.
ఆర్డీ ఓలు, అడిషనల్ కలెక్టర్లు మూడు రోజుల్లోనే పరిష్కరించాలని చెప్పింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మార్వో కార్యాలయాల్లో రెండు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు రంగంలోకి దిగిన అధికారులు దరఖాస్తుల పరిష్కారంపై కేంద్రీకరించి పని చేస్తున్నారు. ఫలితంగా1వ తేదీ నుంచి 5వ తేదీ సాయంత్రం వరకు 62 వేల దరఖాస్తులు పరిష్క్రించినట్లు సమాచారం.