- మరో 71 మంది పరిస్థితి విషమం
విధాత: మహారాష్ట్ర నాందేడ్‌లోని ప్రభుత్వ దవాఖానలో మరణ మృదంగం ఆగడం లేదు. సోమవారం 24 గంటల్లో 24 మంది చనిపోగా, సోమవారం రాత్రి మరో ఏడుగురు రోగులు చనిపోయారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు. దాంతో గత 48 గంటల్లో శంకర్‌రావ్ చవాన్ ప్రభుత్వ దవాఖానలో మరణించిన వారి సంఖ్య 31కి చేరుకున్నది. ఈ 31 మంది రోగుల్లో 16 మంది పిల్లలు కూడా ఉన్నారు. దవాఖానలో ఇంకా 71 మంది రోగుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది.
వరుస మరణాల ఘటనపై దవాఖాన డీన్ డాక్టర్ శ్యామ్‌రావ్ వాకోడ్ స్పందించారు. రోగులకు చికిత్స అందించడంలో వైద్యుల నిర్లక్ష్యం లేదని తెలిపారు. మందులు, వైద్యుల కొరత కూడా లేదని పేర్కొన్నారు. సరైన చికిత్స అందించినప్పటికీ రోగులు చికిత్సకు స్పందించడం లేదని వెల్లడించారు.
మహారాష్ట్ర వైద్య విద్యాశాఖ మంత్రి హసన్ ముష్రిఫ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. తాను నాందేడ్ వెళ్తున్నానని, రోగుల మరణాలపై దర్యాప్తు జరిపి, నిర్లక్ష్యం కారణమని తెలితే నిందితులను శిక్షిస్తామని తెలిపారు. మృతులపై విచారణకు కమిటీని ఏర్పాటు చేసినట్టు మహారాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కాగా, ప్రభుత్వ దవాఖానలో వరుస మరణాలతో ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి.