Birds
- అందులో 25 రకాల ఉనికి ప్రమాదంలో
- జెడ్ఎస్ఐ సర్వేలో వెల్లడి
కోల్‌కతా: ప్రపంచంలోని మరే దేశంలోనూ కనిపించని 78 రకాల జాతులకు చెందిన పక్షలు భారతదేశంలో ఉన్నాయని జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధ్యయనంలో తేలింది. ప్రపంచ వ్యాప్తంగా 10,906 జాతుల పక్షులు ఉన్నాయని, అందులో 1353 జాతులు భారతదేశంలో కనిపిస్తాయని జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్త అమిత్వ మజుందార్ తెలిపారు. అంటే ప్రపంచంలోని పక్షి జాతుల్లో 12.4 శాతం జాతులు భారత్‌లో ఉన్నట్టు ఆయన చెప్పారు.
భారతదేశంలో మాత్రమే కనిపించే 78 రకాల పక్షి జాతుల్లో 25 జాతుల మనుగడ ప్రమాదంలో ఉన్నదని అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సంఘం (ఐయూసీఎన్) వర్గీకరించిందని మజుందార్ వెల్లడించారు. భారత భౌగోళిక ప్రాంతాల్లో 78 రకాల పక్షి జాతులు మన దగ్గర మాత్రమే ఉన్నాయి. దేశ 75వ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా అంతరించిపోతున్న 75 పక్షి జాతుల పేరిట తీసుకొచ్చిన పుస్తకంలో 75 జాతులపై మేం దృష్టిసారించాం’ అని ఆయన తెలిపారు.
28 రకాల పక్షి జాతులు పశ్చిమ కనుమల్లోనే ఉంటాయని చెప్పారు. మరో 25 జాతులు అండమాన్ నికోబార్ ప్రాంతాల్లో కనిపిస్తాయని తెలిపారు. నాలుగు అరుదైన జాతులు తూర్పున హిమాలయ ప్రాంతాల్లోనే ఉంటాయని చెప్పారు. దక్కన్ పీఠభూమి దక్షిణప్రాంతంలో ఒక జాతి, మధ్య భారత అటవీ ప్రాంతంలో మరో అరుదైన జాతి ఉన్నట్టు వివరించారు. అంతరించిపోయే దశలో ఉన్న 25 రకాల జాతుల్లో మూడు జాతుల మనుగడ అత్యంత ప్రమాదకర స్థితిలో, ఐదు జాతుల మనుగడ ప్రమాదకర స్థితిలో, 17 జాతుల మనుగడ దుర్బల స్థితిలో ఉన్నట్టు తెలిపారు.
మరో 11 జాతులు ప్రమాదానికి అతి చేరువలో ఉన్నట్టు చెప్పారు. అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్న పక్షి జాతుల్లో మణిపూర్ బుష్ క్వెయల్ (Perdicula manipurensis), హిమాలయన్ క్వెయల్ (Ophrysia superciliosa), జర్డోన్స్ కోర్సర్ (Rhinoptilus bitorquatus) ఉన్నాయని, వాటిని తమ పుస్తకంలో చేర్చలేదని వెల్లడించారు. ప్రస్తుతానికి ఉన్న రికార్డులను బట్టి.. మణిపూర్ బుష్ క్వెయల్ చివరిసారిగా 1907లో కనిపించింది. హిమాలయన్ క్వెయల్1876లో , జర్డోన్స్ కోర్సర్ 2009లో చివరిసారి కనిపించాయి.