విధాత, ఉమ్మడి నల్గొండ జిల్లా బ్యూరో: నల్లగొండ మున్సిపాలిటీకి ప్రభుత్వం నిధుల వరదను వదిలింది. నల్లగొండ పట్టణంలోని వివిధ అభివృద్ధి పనుల కోసం జీవో 747 ద్వారా ముఖ్యమంత్రి కెసిఆర్ రూ. 87 కోట్ల అభివృద్ధి నిధులు మంజూరు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
నల్లగొండ పట్టణంలోని 48వార్డులలో వివిధ అభివృద్ధి పనులకు సీసీ రోడ్లు, మురికి కాలువలు, పార్కు ల అభివృద్ధితో పాటు వాటర్ వర్క్స్ తదితర పనులకు కోసం రూ. 55 కోట్లు, డీఈఓ ఆఫీస్ నుండి కేశరాజుపల్లి వరకు సెంట్రల్ లైటింగ్ తో పాటు చెట్ల పెంపకం కోసం అదనంగా రూ. 18 కోట్ల రూపాయలు, వివేకానంద విగ్రహం నుండి పెద్ద బండ వరకు మధ్య తరహా సెంట్రల్ లైటింగ్, ఫుట్ పాత్ ల నిర్మాణం, డ్రైనేజీ నిర్మాణం కోసం అదనంగా రూ. 14 కోట్లు మొత్తంగా రూ. 87 కోట్ల అభివృద్ధి నిధుల కోసం ప్రభుత్వం ఇతరులు జారీ చేయడం శుభ పరిణామం అన్నారు.
నల్లగొండ అభివృద్ధికి అడిగిందే తడువుగా వందలాది కోట్ల నిధులు కేటాయిస్తూ నల్లగొండను నందనవనంగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు దృష్టి సారిస్తున్నారని పేర్కొన్నారు. బిఆర్ఎస్ లో చేరిన వెంటనే తనకు నల్లగొండ టికెట్ కేటాయించి గెలిపించడమే కాకుండా నల్లగొండ సమగ్రాభివృద్ధిలో భాగస్వామిని చేసినందుకు కెసిఆర్ కు సర్వదా కృతజ్ఞుడనై ఉంటానని ప్రకటించారు. అదేవిధంగా మంత్రి కేటీఆర్ తో పాటు జగదీష్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.