92.68 శాతం రైతుబంధు చెల్లింపులు పూర్తి

యాసంగి రైతుబంధు చెల్లింపుల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం 92.68శాతం పూర్తి చేసింది.

  • Publish Date - March 29, 2024 / 11:57 AM IST

  • 5,575 కోట్ల చెల్లింపులు
  • 64లక్షల 75వేల 320మంది రైతుల ఖాతాలకు డబ్బులు

విధాత, హైదరాబాద్ : యాసంగి రైతుబంధు చెల్లింపుల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం 92.68శాతం పూర్తి చేసింది. మార్చి 28వ తేదీ నాటికి ఐదు ఎకరాల వరకు ఉన్న 64లక్షల 75వేల 320మంది రైతులకు సంబంధించి 1కోటి 11లక్షల 49,534ఎకరాలకు సంబంధించిన 5,575 కోట్ల డబ్బులను ఖాతాల్లో జమ చేసినట్లుగా వ్యవసాయ శాఖ ప్రకటించింది.


ఇప్పటివరకు జరిగిన చెల్లింపుల ప్రకారం ఒక ఎకరం లోపు ఉన్న రైతులు 22,24,870మందికి, రెండెకరాల లోపు ఉన్న రైతులు 17,72,675 మంది, మూడెకరాల లోపు 11,30,788 మంది, నాలుగెకరాల లోపు 6,54,419 రైతులు, అయిదెకరాల లోపు 4,92,568 మంది రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధులు జమ అయ్యాయి.


సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినట్లుగా కొత్త ప్రభుత్వం తొలి వంద రోజుల్లోనే దాదాపు 80 శాతం మంది రైతులకు రైతు బంధు చెల్లింపులు చేసింది. తాజా లెక్కల మేరకు 92.68శాతం చెల్లింపులు పూర్తి చేసింది. ఒక ఎకరం నుంచి మొదలుపెట్టి రెండు, మూడు ఎకరాల వరకు చెల్లింపులు చేసిన ప్రభుత్వం..మార్చిలో అయిదెకరాల వరకు భూములున్న రైతులందరికీ ఈ సాయాన్ని అందజేసింది. గతంలో ఉన్న వివరాల ప్రకారమే యాసంగి రైతు బంధు చెల్లింపులు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.


గత ప్రభుత్వం ఇచ్చినట్లు గుట్టలు, కొండలు, రోడ్లు, వెంచర్ వేసిన భూములకు రైతు బంధు ఇచ్చేది లేదని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో ప్రకటించారు. దుబారా లేకుండా, ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం కాకుండా అర్హులైన వారందరికీ లబ్ధి చేకూర్చేలా ప్రణాళికను సిద్ధం చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖను ఆదేశించారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం రైతు బంధుకు బదులు త్వరలోనే రైతు భరోసా పథకం అమలు చేయాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది.

Latest News