- ఇద్దరు మృతి.. 12 మంది అదృశ్యం
- ప్రమాద ఘటన దర్యాప్తుకు సిట్
విధాత: హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్ జిల్లాలోని పెర్ఫ్యూమ్ తయారీ కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. మరో 12 మంది ఘటన తర్వాత కనిపించకుండా పోయారు. సోలన్‌లోని బద్ది ప్రాంతంలోని ఎన్‌ఆర్ అరోమా ఫ్యాక్టరీలో శుక్రవారం మధ్యాహ్నం 2:45 గంటలకు మంటలు చెలరేగాయి. ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా, మరో 31 మంది గాయపడ్డారు. ఎన్ఆర్ అరోమా ప్లాంట్ అధినేత చందర్ శేఖర్‌ను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.
అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి ఒక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే, మృతురాలిని ఇంకా గుర్తించలేదని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ నలగర్ దివాన్షి సింగల్ శనివారం తెలిపారు. తప్పిపోయిన ఇతర వ్యక్తుల కోసం గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో సుమారు 50 మంది ఉన్నారని, వారిలో కొందరు తమ ఇండ్లు పరిగెత్తారని, ఇంకా 13 మంది తప్పిపోయారని తెలిపారు.
ఫ్యాక్టరీలో 85 మంది ఉన్నారని, తొమ్మిది మంది గల్లంతయ్యారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించామని, పెర్ఫ్యూమ్‌ల తయారీకి ఉపయోగించే మండే పదార్థాలు మంటలు అంటుకుంటున్నందున మంటలు ఇంకా అదుపులోకి రాలేదని శర్మ తెలిపారు. డీజీపీ సంజయ్ కుందు సంఘటనా స్థలంలో పరిస్థితిని పరిశీలించారు. ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు కోసం అదనపు పోలీసు సూపరింటెండెంట్ అశోక్ వర్మ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయాలని ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం గాయపడిన ఐదుగురిని చండీగఢ్‌లోని దవాఖానకు తరలించారు. ఒక మహిళ మరణించినట్టు ప్రకటించారు.
అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, ఫోరెన్సిక్ బృందం, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, పోలీసులు, రెవెన్యూ, ఇతర బృందాలు సంఘటనా స్థలంలో ఉన్నాయని శర్మ చెప్పారు. తప్పిపోయిన వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు ఫ్యాక్టరీ బయట ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.