Marriage | పెళ్లైన గంటకే భార్యకు విడాకులిచ్చాడు. ఆమెను ఒంటరి చేయొద్దన్న ఉద్దేశంతో తన తమ్ముడితో వివాహం జరిపించాడు. ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. సంభాల్ జిల్లా పరిధిలోని సైద్‌నగలి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి నాలుగేండ్ల క్రితం వివాహమైంది. అయితే పెళ్లి అయినప్పటి నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో కొద్ది కాలం క్రితం భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో ఒంటరిగా ఉన్న భర్త మరో యువతిపై మనసు పారేసుకున్నాడు. ఆమెను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు.
ఇక పెళ్లి తేదీ రానే వచ్చింది. అందరూ వివాహ వేదికకు వచ్చేశారు. అంతలోనే మొదటి భార్య కూడా అక్కడ ప్రత్యక్షమైంది. తాను బతికుండగా, రెండో పెళ్లి ఎలా చేసుకుంటావని అతన్ని నిలదీసింది. విడాకులు ఇవ్వకుండా పెళ్లి చేసుకోవడం సరికాదని ఆమె వాదించింది. పోలీసుల దాకా వెళ్తే సమస్య కొని తెచ్చుకున్నట్లు అవుతుందని, పెద్దలు సర్దిచెప్పడంతో.. పెళ్లైన గంటకే రెండో భార్యకు విడాకులు ఇచ్చాడు. ఇక తన తమ్ముడితో రెండో భార్యకు వివాహం జరిపించాడు అన్న. దీంతో గొడవ సద్దుమణిగింది.