Nizamabad |
విధాత: తమ కుమారుడికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు తల్లిదండ్రులు కుమారుడి కాళ్లు పట్టుకుని లోపలికి ఈడ్చుకెళ్లారు. అయితే ఈ ఘటన గత నెల 31వ తేదీన చోటు చేసుకోగా ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. అనారోగ్యానికి గురైన కుమారుడిని అతడి తల్లిదండ్రులు మార్చి 31వ తేదీన నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకు వచ్చారు. డ్యూటీలో ఉన్న వైద్యులు అతడికి చికిత్స అందించారు. ఆ రోగికి పలు ఆరోగ్య సమస్యలు ఉండటంతో జనరల్ మెడిసిన్ విభాగానికి చెందిన డాక్టర్లను కలవాలని తల్లిదండ్రులకు వైద్యులు సూచించారు.
దీంతో మరుసటి రోజు ఉదయం రోగిని జనరల్ మెడిసిన్ విభాగానికి తరలించేందుకు పేషెంట్ కేర్ సిబ్బందిని అడిగి వీల్‌చైర్ తీసుకు రాగా తాగిన మత్తులో ఉన్న రోగి సతాయించడంతో ఆ రోగిని తల్లిదండ్రులే రెండో అంతస్తులోని జనరల్ మెడిసిన్ విభాగానికి నేలపై ఈడ్చుకెళ్లారు.
ఈ దృశ్యాలను అక్కడున్న కొంతమంది తమ ఫోన్లలో చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే అసలు విషయం తెలియని నెటిజన్లు అస్పత్రిలో నిర్లక్ష్యం అంటూ వీడియో తెగ వైరల్ చేశారు. సిబ్బంది లేకపోవడం వల్ల ఇలా చేశారా..? లేక సిబ్బంది నిర్లక్ష్యమే ఇందుకు కారణమా..? లేక వీల్ చైర్లు ఉన్నాయా? లేవా..? అంటూ పలు ప్రశ్నలు లేవదీశారు.
అయితే ఈ ఘటనపై ఆస్పత్రి సిబ్బంది స్పందించారు. వీల్ చైర్ తీసుకొచ్చేలోపే రోగిని తల్లిదండ్రులు నేలపై ఈడ్చుకుంటూ తీసుకెళ్లారని తెలిపారు. రెండో అంతస్తుకు వెళ్లాక వీల్ చైర్‌లో తీసుకెళ్లినట్లు సిబ్బంది పేర్కొన్నారు. జనరల్ మెడిసిన్ విభాగం వైద్యులు అతన్ని పరీక్షించిన అనంతరం వీల్ చైర్‌లోనే కిందకు దిగబెట్టినట్లు సిబ్బంది స్పష్టం చేశారు.
ఆ రోగి మద్యం సేవించి ఉన్నాడు : సూపరింటెండెంట్ ప్రతిమా రాజ్
నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో రోగిని ఈడ్చుకుంటూ వెళ్లిన ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ స్పందించారు. ఆస్పత్రిలో వీల్ చైర్ల, స్ట్రెచర్స్ కొరత లేదని స్పష్టం చేశారు. అయితే మార్చి 31వ తేదీన రాత్రి 10 గంటలకు వచ్చిన వ్యక్తి మద్యం సేవించి ఉన్నాడని ప్రతిమారాజ్ తెలిపారు.
ఆ రోజు రాత్రే అతనికి చికిత్స అందించి వెయిటింగ్ రూమ్‌లో ఉంచినట్లు పేర్కొన్నారు. ఆస్పత్రి సిబ్బంది ఉండగా, తల్లిదండ్రులు అతన్ని ఎందుకలా ఈడ్చుకెళ్లారని ప్రశ్నించారు. 10 సెకన్లలో వీడియో పూర్తయిందంటే సిబ్బంది గమనించినట్లే కదా.
అక్కడ సిబ్బంది ఉండి మాట్లాడి ఎందుకు వీడియో తీస్తున్నారని అడిగితేనే అక్కడితో వీడియో ఆగిపోయిందని ప్రతిమారాజ్ తెలిపారు. వీడియో తీసిన వ్యక్తిని సిబ్బంది ప్రశ్నిస్తే పారిపోయాడు. ఉద్దేశపూర్వకంగానే వీడియో తీసినట్లు అనిపిస్తోందన్నారు. అందుకే పదిహేను రోజుల తర్వాత సోషల్ మీడియాలో పోస్టు చేశారని పేర్కొన్నారు.