Site icon vidhaatha

suicide Note: నిరుద్యోగి ఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్‌

విధాత, కరీంనగర్ బ్యూరో: రాజన్న సిరిసిల్ల జిల్లా బివైనగర్‌కు చెందిన నిరుద్యోగ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాల లీకేజీ ఓవైపు రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో మంత్రి కే తారక రామారావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకోవడం సంచలనాత్మకంగా మారింది.

బి వై నగర్ కు చెందిన చిటికెన నాగభూషణం, సుశీల దంపతుల ముగ్గురు కుమారుల్లో చిన్నవాడైన
నవీన్ కుమార్(30) శుక్రవారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హోటల్ మేనేజ్‌మెంట్ చేసిన నవీన్ సాఫ్ట్‌వేర్ రంగంలో స్థిరపడేందుకు ప్రయత్నాలు చేశాడు.

మరోవైపు గ్రూప్స్ కు ప్రిపేర్ అవుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఉద్యోగ అన్వేషణలో విసిగి, వేసారి పోయిన నవీన్ బలవన్మరణానికి పాల్పడినట్లు అతని సూసైడ్ లేఖను పరిశీలిస్తే అర్థం అవుతుంది.

మూడు పదుల వయసులోనే నవీన్ అర్ధంతరంగా తనువు చాలించడం స్థానికులను కంటతడి పెట్టించింది. చెట్టంత ఎదిగిన కొడుకు అకాల మరణం చెందడంతో అతని తల్లిదండ్రులు కన్నీరు, మున్నీరు అవుతున్నారు.

‘అన్ సాటిస్ఫైడ్ లైఫ్.. నో వన్ ఇస్ రీజన్ ఫర్ దిస్… ఐ యాం యూస్ లెస్ ఫర్ ఆల్ జాబ్ లెస్.. థాంక్యూ టు మై ఫ్యామిలీ… హై క్విట్స‌ అని ఉరి వేసుకునే ముందు లేఖ రాశాడు నవీన్ కుమార్. ఈ లేఖ.. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రతకు, నిరుద్యోగుల మానసిక వేదనకు అద్దం పడుతోంది.

Exit mobile version