గాల్లో ఉండ‌గానే ఊడిపోయిన విమానం త‌లుపు.. వైర‌ల‌వుతున్న వీడియో

అలాస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737-9 మ్యాక్స్ విమానంలో అరుదైన ప్ర‌మాదం చోటు చేసుకుంది

  • Publish Date - January 6, 2024 / 07:29 AM IST

అలాస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ (Boeing) 737-9 మ్యాక్స్ విమానంలో అరుదైన ప్ర‌మాదం చోటు చేసుకుంది. విమానం గాల్లో ఉండగానే దాని త‌లుపు ఒక‌టి ఊడిపోయింది. ఈ ఘ‌ట‌న‌ను అందులోని ప్ర‌యాణికులు వీడియో తీశారు. ఆ వీడియోలో విమానం మ‌ధ్య క్యాబిన్‌కు చెందిన త‌లుపు లేన‌ట్లు క‌నిపిస్తోంది. శ‌నివారం పోర్ట్‌లాండ్ నుంచి కాలిఫోర్నియాలోని ఒంటారియోకు వెళుతున్న ఈ విమానం.. గాల్లోకి ఎగిరిన కొద్దిసేప‌టికే ఈ ప్ర‌మాదానికి గురైంది.


ఘ‌ట‌న స‌మ‌యంలో 171 మంది ప్ర‌యాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే పైల‌ట్ విమానాన్ని తాము బ‌యలుదేరిన పోర్ట్‌ల్యాండ్ విమానాశ్ర‌యంలో అత్య‌వ‌స‌ర ల్యాండిండ్ చేశారు. ఘ‌ట‌న‌లో ఎవ‌రూ గాయ‌ప‌డ‌లేద‌ని.. ప్ర‌మాదంపై దర్యాప్తు చేప‌డుతున్న‌ట్లు అలాస్కా ఎయిర్‌లైన్స్ ఎక్స్‌లో పేర్కొంది. విమానాల గ‌మ‌నాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు అందించే ఫ్లైట్‌రాడార్ 24 ప్ర‌కారం.. విమానం త‌లుపు ఊడిపోయిన‌ప్ప‌డు అది 16,325 అడుగుల ఎత్తులో ఉన్న‌ట్లు తెలుస్తోంది.


ప్ర‌మాదానికి గురైన విమానం అలాస్కా ఎయిర్‌లైన్స్ చేతికి 2023 అక్టోబ‌ర్ 1న రాగా 2023 న‌వంబ‌ర్ 11న తొలిసారి గాల్లోకి ఎగిరింది. అప్ప‌టి నుంచి ఇది కేవ‌లం 145 ప్ర‌యాణాలు మాత్ర‌మే చేయ‌డం గ‌మ‌నార్హం. కాగా బోయింగ్‌కే చెందిన 737 మ్యాక్స్ విమానాల్లో ఒక బోల్టు వ‌దులుగా ఉంద‌ని ఇటీవ‌ల నివేదిక వెలువ‌డిన విష‌యం తెలిసిందే. భార‌త్ స‌హా వివిధ దేశాలు త‌మ దేశాల్లో ప్ర‌యాణిస్తున్న ఆ శ్రేణి విమానాల‌ను ఆడిట్ చేస్తున్నాయి.

Latest News