Aishwarya Rutuparna | ఐశ్వ‌ర్య‌.. తొలి ట్రాన్స్‌జెండ‌ర్ సివిల్ స‌ర్వెంట్.. అస‌లు ఎవరామె..?

ఆమె పుట్టుక‌తోనే మ‌గ‌.. కానీ అన్ని ఆడ ల‌క్ష‌ణాలే. ఇంట్లో నుంచి మొదలుకుంటే.. విద్యాలయాల వ‌ర‌కు అంద‌రూ ఆమెను అవ‌మానించిన వాళ్లే.. హేళ‌న చేసిన వాళ్లే

  • Publish Date - April 13, 2024 / 03:38 PM IST

ఆమె పుట్టుక‌తోనే మ‌గ‌.. కానీ అన్ని ఆడ ల‌క్ష‌ణాలే. ఇంట్లో నుంచి మొదలుకుంటే.. విద్యాలయాల వ‌ర‌కు అంద‌రూ ఆమెను అవ‌మానించిన వాళ్లే.. హేళ‌న చేసిన వాళ్లే. చివ‌ర‌కు క‌న్న తండ్రి కూడా ఆమెను ప‌ట్టించుకోలేదు. ఈ అవ‌మానాలు, అవ‌హేళ‌న‌లు, చీత్కారాల‌తో నిత్యం బాధ‌లు అనుభ‌వించిన ఆమె.. తొలి ట్రాన్స్‌జెండ‌ర్ సివిల్ స‌ర్వెంట్‌గా నిలిచింది. ఆమెనే ఐశ్వ‌ర్య రుతుప‌ర్ణ ప్ర‌ధాన్. ప్ర‌స్తుతం ఆమె ఒడిశా ఫైనాన్షియ‌ల్ స‌ర్వీస్ డిపార్ట్‌మెంట్‌లో క‌మ‌ర్షియ‌ల్ ట్యాక్స్ ఆఫీస‌ర్‌గా విధులు నిర్వ‌ర్తిస్తున్నారు.

ఎవ‌రీ ఐశ్వ‌ర్య రుతుప‌ర్ణ ప్ర‌ధాన్..?

ఒడిశా కంద‌మాల్ జిల్లాలోని కతిబ‌గేరి గ్రామంలో ఐశ్వ‌ర్య జ‌న్మించారు. ఆమె అస‌లు పేరు ర‌తీకాంత‌. అయితే ఆమె అబ్బాయిలా పుట్టిన‌ప్ప‌టికీ అన్ని ఆడ ల‌క్ష‌ణాలే. దీంతో కుటుంబ స‌భ్యుల‌తో పాటు బ‌య‌టి స‌మాజం నుంచి ఆమెకు అనేక అవ‌మానాలు ఎదుర‌య్యాయి. ఆరో త‌ర‌గ‌తిలో ఉన్న‌ప్పుడు అంద‌రి వేధింపులు భ‌రించ‌లేక తాను ఆడ అని గ‌ట్టిగా అంద‌రికీ తెలిసేలా చెప్పింది. అక్క‌డితో ఆమెకు వేధింపులు ఆగుతాయ‌నుకుంది. కానీ అది జ‌ర‌గ‌లేదు. యూనివ‌ర్సిటీలోనూ ఐశ్వ‌ర్యను ర్యాగింగ్ చేశారు. అలాంటి వాటికి ఆమె భ‌య‌ప‌డ‌లేదు. ఉత్క‌ల్ యూనివ‌ర్సిటీ నుంచి మాస్ క‌మ్యూనికేష‌న్‌లో డిగ్రీ పూర్తి చేశారు. మాస్ట‌ర్స్ డిగ్రీలో ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్ ప‌ట్టా పుచ్చుకున్నారు. జ‌ర్న‌లిజంలో పీజీ డిప్లొమా కోర్సు కూడా పూర్తి చేశారు. ఒడిశా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులో చేరే కంటే ముందు ఆమె సిండికేట్ బ్యాంకులో ప‌ని చేశారు.

ఐశ్వ‌ర్య జ‌ర్నీలో ఆమెకు అన్ని విధాలుగా అండ‌గా ఉన్న‌ది భూమిక‌. భూమిక ఐశ్వ‌ర్య చిన్న‌ప‌ట్నుంచి ఫ్రెండ్స్. ఇద్దరికి ఒకే స్కూల్. ఇక ఐశ్వ‌ర్య‌ను వేధింపుల‌కు గురి చేసిన‌ప్పుడు భూమిక ధైర్యాన్నిచ్చేంది. ఒకానొక ద‌శ‌లో ఐశ్వ‌ర్య స్కూల్ మానేయాల‌నుకుంది. కానీ భూమిక చెప్పిన ధైర్యంతో, అన్ని అవాంత‌రాల‌ను ఎదుర్కొని ఐశ్వ‌ర్య ముందుకు క‌దిలింది. త‌న చ‌దువును కొన‌సాగించింది. చివ‌ర‌కు ఒడిశా సివిల్ స‌ర్వీసెస్ ప‌రీక్ష‌లో ఉత్తీర్ణ‌త సాధించారు. భూమిక‌కు తాను ఎల్ల‌ప్పుడూ రుణ‌ప‌డి ఉంటాన‌ని ఐశ్వ‌ర్య తెలిపారు.

Latest News