విధాత: ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈరోజు కర్నూలు జిల్లాలో సాగింది. ఆలూరు నియోజకవర్గం హాలహర్వి బస్టాండ్ వద్ద ఉదయం 7.05కు ప్రారంభమై కురవల్లి మీదుగా సాగుతూ అగ్రహారం శిబిరం వద్దకు 9 గంటలకు చేరుకుంది. తిరిగి సాయంత్రం 4 గంటలకు యాత్ర ప్రారంభమై.. ఆలూరు, హులేబీడు మీదుగా మనేకుర్తి వరకు సాగింది.
ఈ సందర్బంగా మనేకుర్తి వద్ద ఏర్పటు చేసిన సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కార్పొరేట్లకు ఉపయోగపడేలా బిజెపి పాలన సాగిస్తోందని రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏపికి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. బిజెపి విభజన రాజకీయాలు చేస్తూ దేశాన్ని ఎక్కడికక్కడ విడదీస్తోందని, అందుకోసమే ఈ యాత్ర చేస్తున్నామని తెలిపారు. ఎన్నడూ లేనంతగా దేశంలో నిరుద్యోగం పెరిగిందని, ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, రైతులకు వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదని తెలిపారు. యాత్రలో పాల్గొంటున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
అంతకుముందు.. అమరావతి రైతులు తనను కలిశారని, రాజధాని కోసం భూములిస్తే రాజధాని మార్చాలని వారిని ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. మూడు రాజధానులు నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందని, అమరావతి రైతుల సమస్య పట్ల తాము చిత్తశుద్దితో ఉన్నామని, రైతుల సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు.
తాము అధికారంలోకి వస్తే ఏకైక రాజధానిగా అమరావతిని చేస్తామని అమరావతి రైతులకు హామీ ఇచ్చారు. వైసిపి ప్రభుత్వంలో అమరావతి రైతులకు తీరని అన్యాయం చేసేలా వ్యవహరిస్తోందని రైతులు తెలిపారు. తమ పార్టీ నుంచి అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని రైతులకు రాహుల్ హామీ ఇచ్చారు.
దాదాపు 40 మంది రైతులు అమరావతి నుంచి రాహుల్ గాంధీని కలిసేందుకే రాగా కొందరికే అనుమతి ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే పోలవరం రైతులకు ఆర్ఓఆర్ ప్యాకేజీ అమలు చేసిన తరువాతనే ముందుకు వెళ్తామని రాహుల్ గాంధీ పోలవరం రైతులకు హామీ ఇచ్చారు. జోడో యాత్ర విరామ సమయంలో పోలవరం రైతులు రాహుల్ ను కలిశారు. ఆర్ ఓ ఆర్ ప్యాకేజీ ప్రకారం నష్ట పరిహారం ఇవ్వడం లేదని, ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తోందని రైతులు రాహుల్ గాంధీకి వివరించారు.
యాత్రకు ముందుగా యువకుల బ్యాండ్ పరేడ్ ఆకట్టుకుంది. భారీ జనసందోహం మధ్య, డప్పుల చప్పుళ్ళతో యాత్ర సాగింది. ప్రజలు అడుడగుగునా స్వాగతం పలికారు. యాత్రలో రా ఎపిసిసి అధ్యక్షులు సాకే శైలజానాథ్, ఏఐసిసి నాయకులు దిగ్విజయ్ సింగ్, జేడి శీలం, కొప్పుల రాజు, సుబ్బరామిరెడ్డి, బాపిరాజు, చింతా మోహన్, తెలంగాణ పిసిసి మాజీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మరో మూడు రోజుల పాటు ఎపిలో యాత్ర సాగనుంది. బుధవారం చాగి నుంచి అరేకల్ వరకూ యాత్ర సాగనుంది. రాహుల్ గాంధీతో పాటు ముఖ్యనాయకులు, యాత్రీకులు చాగి వద్ద ఏర్పాటు చేసిన కేంద్రంలో రాత్రికి బస చేయనున్నారు.