Site icon vidhaatha

Amarnath Yatra | అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లాలనుకునే భక్తులకు అలెర్ట్‌.. యాత్ర రిజిస్ట్రేషన్లు నేటి నుంచే..!

Amarnath Yatra | జూలై ఒకటో తేదీ నుంచి అమర్‌నాథ్‌ యాత్ర షురూకానున్నది. రెండు నెలల పాటు కొనసాగనున్నది. ఆగస్టు 31 తేదీతో యాత్ర పూర్తికానున్నది. ఈ క్రమంలో యాత్రలో పాల్గొనే భక్తుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ సోమవారం ప్రారంభంకానున్నది. దక్షిణ కశ్మీర్‌ హిమాలయాల్లో సముద్రమట్టానికి 3,880 మీటర్ల ఎత్తులో అమర్‌నాథ్‌ ఉంటుంది. ఏటా లక్షలాది మంది భక్తులు మంచులింగంగా దర్శనమిచ్చే పరమేశ్వరుడిని దర్శించుకునేందుకు తరలివస్తుంటారు.

యాత్రలో పాల్గొనే భక్తుల కోసం జమ్మూకశ్మీర్‌లోని 20 బ్యాంకు శాఖలతో పాటు దేశవ్యాప్తంగా 542 జాతీయ బ్యాంకుల్లో రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించినట్లు అమర్‌నాథ్‌ దేవస్థాన్‌ బోర్డు పేర్కొంది. మరో వైపు యాత్ర నేపథ్యంలో 164 మందితో వైద్యు బృందాన్ని ప్రభుత్వం నామినేట్‌ చేసింది. అలాగే యాత్రకు రాలేని భక్తుల కోసం అమర్నాథ్ దేవస్థానంలో ఉదయం, సాయంత్రం పూట పూజలను లైవ్ టెలీకాస్ట్‌ను చేయనున్నది. ఈ యాత్ర గురించి రియల్ టైం సమాచారం, దారిలో వాతావరణం, ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండే తదితర సేవలను వినియోగించుకునేందుకు ప్రత్యేకంగా ఓ యాప్‌ను కశ్మీర్‌ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఇదిలా ఉండగా.. జమ్మూ కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా సారథ్యంలో రాజ్‌భవన్‌లో ఇటీవల ఎస్‌ఏఎస్‌బీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా షెడ్యూల్‌ను ప్రకటించారు. యాత్ర సులభతరంగా, ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎల్‌జీ పేర్కొన్నారు. యాత్ర ప్రారంభానికి ముందే టెలికాం సేవలను పునరుద్ధరించడంతో పాటు వసతి, విద్యుత్‌, నీటి సదుపాయం, భద్రత తదితర ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు. అనంత్‌నాగ్‌లోని పహల్గామ్‌ నుంచి, గందర్బాల్ జిల్లాలోని బల్తాల్ నుంచి ఏకకాలంలో యాత్ర ప్రారంభమవుతుందని ఎల్‌జీ వివరించారు.

Exit mobile version