Site icon vidhaatha

Amrit Udyan | పర్యాటకులకు గుడ్‌న్యూస్‌..తెరుచుకోనున్న అమృత్‌ గార్డెన్‌

Amrit Udyan | దేశ రాజధాని న్యూఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో ఉన్న అమృత్‌ ఉద్యానవనం సామాన్యుల కోసం తెరువనున్నారు. ఈ ఉద్యాన‌వనాన్ని సంద‌ర్శించాల‌నుకునేవారికి నిజంగా ఇది శుభవార్త లాంటిదే. ఈ నెల 2వ తేదీ నుంచి ఓపెన్‌ చేయనుండగా.. మార్చి 31 వరకు ఎప్పుడైనా సందర్శించేందుకు అవకాశం ఉన్నది. అమృత్ ఉద్యాన్‌లోని వివిధ రకాల పువ్వులు, ఫౌంటైన్‌లు, ఉద్యానవనాల అందాలను చూసే అవకాశం కలుగనున్నది. అమృత్‌ గార్డెన్‌ను సందర్శించేందుకు టికెట్‌ను బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అమృత్‌ గార్డన్‌ను సందర్శించాలంటే ముందుగా ఏం చేయాలో తెలుసుకుందాం పదండి..!


స్లాట్ల వారీగా పర్యాటకులకు అనుమతి


అమృత్ ఉద్యానవనాన్ని సందర్శించేందుకు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ప్రవేశానికి అనుమతి ఉంటుంది. అయితే, సాయంత్రం 5 గంటల వరకు గార్డెన్‌ని సందర్శించేందుకు వీలుంటుంది. ఉద్యానవనం సందర్శనకు వచ్చే పర్యాటకులను ఆరు స్లాట్లలో పర్యాటకులకు ప్రవేశం కల్పిస్తారు. రెండు స్లాట్స్‌లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గార్డెన్‌ ద్వారాలు తెరుస్తారు. ఒకే స్లాట్‌లో 7500 మంది వీక్షించేందుకు అనుమతి ఇస్తారు.


వారాంతాల్లో స్లాట్‌కు వెయ్యి మంది వరకు వీక్షించేందుకు అనుమతి ఇస్తారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నాలుగు షిఫ్టుల్లో 5వేల మందిని, వారాంతాల్లో 7500 మందికి మాత్రమే అనుమతి ఉంటుంది. ఇక ఫిబ్రవరి 22న వికలాంగులకు, 23న రక్షణ, పారామిలటరీ, పోలీసు సిబ్బంది, మహిళలు, మార్చి 1న గిరిజన మహిళల స్వయం సహాయక సంఘాలకు, అనాథాశ్రమాల పిల్లల కోసం మార్చి 5న ప్రత్యేకంగా వారికి కోసం మాత్రమే ఉద్యానవనం ద్వారాలు తెరుస్తారు.


టికెట్‌ ఎలా తీసుకోవాలి..


అమృత్ ఉద్యానాన్ని సందర్శించేందుకు ఎంట్రీ టికెట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. టికెట్ బుకింగ్ కోసం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రపతి భవన్ వెబ్‌సైట్ visit.rashtrapatibhavan.gov.in వెబ్‌సైట్‌లో టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. దాంతో పాటు రాష్ట్రపతి భవన్‌లో అమర్చిన కియోస్క్ మిషన్ నుంచి కూడా టికెట్లను పొందేందుకు వీలుంది. అక్కడ ఉన్న కౌంటర్ నుంచి కూడా తీసుకోవచ్చు. అమృత్ ఉద్యాన్‌తో పాటు, పర్యాటకులు రాష్ట్రపతి భవన్ మ్యూజియాన్ని వీక్షించేందుకు అవకాశం ఉంటుంది. అయితే, దీస్లాట్‌ను ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.


ఇలా చేరుకోవాలి..


ఢిల్లీలో ఉన్న ఈ ఉద్యనవనాన్ని మెట్రో ద్వారా చేరుకోవాల‌ని అనుకుంటే మాత్రం సెంట్రల్ సెక్రటేరియట్ సమీపంలోని మెట్రో స్టేషన్ చేరుకోవాలి. నార్త్ ఎవెన్యూ సమీపంలోని రాష్ట్రపతి భవన్‌లోని గేట్ నంబర్‌ 35 నుంచి సాధారణ ప్రజలకు ప్రవేశం కల్పిస్తారు. సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్ నుంచి షటిల్ బస్సు సర్వీస్ ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ప్రతి 30 నిమిషాల వ్యవధిలో అందుబాటులో ఉంటుంది. ఉద్యాన‌వ‌నంలోకి వెళ్లే పర్యాటకులు తమ వెంట మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ కీలు, పర్సులు, హ్యాండ్‌బ్యాగ్‌లు, వాటర్ బాటిళ్లు, పిల్లలకు పాల సీసాలు వంటివి తీసుకెళ్లేందుకు అనుమతిస్తారు.

Exit mobile version