Anantha Sriram
విధాత: ఏపీ ఎన్నికల సెగ సినీ గీత రచయిత అనంత శ్రీరామ్ కు తగిలింది. దీంతో ఆయన తనకు రాజకీయాలతో సంబంధం లేదని వివరణ ఇచ్చారు. సోషల్ మీడియాలో అన్నీ పార్టీలూ యాక్టివ్ గా ఉంటున్నాయి. తమ పార్టీని ప్రమోట్ చేస్తూ అదే సమయంలో అవతలి పార్టీని డ్యామేజ్ చేస్తూ పోస్టులు పెడుతూ సోషల్ మీడియా కార్యకర్తలు నిత్యం రాజకీయాలను రగిలిస్తూ ఉన్నారు.
వాస్తవానికి political missile అనే ట్విట్టర్ ఖాతా నుంచి వైఎస్సార్ మీద కొన్ని పోస్టులు కనిపించాయి. ఆయన్ను అవమానించేలా, తీవ్రంగా విమర్శిస్తూ వచ్చిన ఆ పోస్టులు వైసిపి సోషల్ మీడియా కార్యకర్తలు చూసారు. అది గీత రచయిత అనంత శ్రీరామ్ ఆపరేట్ చేస్తున్నారని, ఆయన పవన్ కళ్యాణ్ కు అత్యంత అభిమాని అని, అంతేకాకుండా గతంలో ఆయన టిడిపి పార్టీకి కొన్ని పాటలు కూడా రాసాడు కాబట్టి ఆయనే ఈ ట్విట్టర్ ఖాతాను నడుపుతూ వైఎస్ మీద ఇలాంటి పోస్టులు చేస్తున్నారు అనేది వైఎస్సార్ కాంగ్రెస్ అభిమానుల అభిప్రాయంగా ఉంది.
అంతే కాకుండా చంద్రబాబు, అనంత శ్రీరామ్ కలిసి ఒకే ఫ్లయిట్ లో వెళ్తున్న ఫొటోను పోస్ట్ చేస్తూ వైసిపి అభిమానులు ఆయన మీద దాడి చేయడం మొదలు పెట్టారు. దీంతో అమెరికాలో ఉన్న అనంత శ్రీరామ్ స్పందించారు.
తాను ఏ రాజకీయ పార్టీకి అనుకూలం కాదని, రచయితగా ఏ పార్టీకి అయిన తాను పాటలు రాస్తాను తప్ప ఎవరిమీదా ప్రత్యేక అభిమానము లేదని, తనది కానీ ట్విట్టర్ ఖాతాను తనదిగా అపోహ పడుతూ తనను నిందిస్తున్నారు అని ఆవేదన చెందుతూ ఒక వీడియోను ఆయన షేర్ చేశారు. మొత్తానికీ అనంత శ్రీరామ్ కు సైతం వైసిపి సోషల్ మీడియా నుంచి ఇలాంటి చేదు అనుభవం ఎదురైందన్నమాట.