Site icon vidhaatha

Beauty Pageant | అందాల పోటీల్లో భార్య‌కు రెండో స్థానం.. త‌ట్టుకోలేక భ‌ర్త ఏం చేశాడంటే..?

Beauty Pageant |

అందాల పోటీల్లో పాల్గొనే మ‌గువ‌లంద‌రూ తామే విజేత‌లుగా నిల‌వాల‌ని పోటీ ప‌డుతుంటారు. అందుకు త‌గ్గ క‌స‌ర‌త్తు కూడా చేస్తారు. ఒక వేళ విజేత‌లుగా నిల‌వ‌ని ప‌క్షంలో తీవ్ర ఆవేద‌నకు గుర‌వుతుంటారు. అయితే అందాల పోటీల్లో త‌న భార్య రెండో స్థానంలో నిల‌వ‌డాన్ని ఆమె భ‌ర్త త‌ట్టుకోలేక‌పోయాడు. అంద‌రూ చూస్తుండ‌గానే వేదిక‌పైకి ఎక్కి.. ఆ కిరీటాన్ని నేల‌కేసి కొట్టాడు. విప‌రీతంగా అరిచాడు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది.

బ్రెజిల్‌లో మిస్ గే మాట గ్రాసో-2023 అందాల పోటీల‌ను శ‌నివారం ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ పోటీల్లో ప‌లువురు అందాల ముద్దుగుమ్మ‌లు పాల్గొని త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకున్నారు. పోటీదారుల్లో ఇద్ద‌రిని ఫైన‌ల్‌కు ఎంపిక చేశారు. ఇక ఆ ఇద్ద‌రిలో ఒక‌రిని విజేత‌గా ప్ర‌క‌టించారు నిర్వాహ‌కులు. ఇమ్మాన్యుయెల్ బెలీని అనే మ‌హిళ విజేత‌గా నిల‌వ‌గా, న‌థాలీ బెక‌ర్ ర‌న్న‌ర్‌గా నిలిచింది.

న‌థాలీ బెక‌ర్ విజేత‌గా నిల‌వ‌క‌పోవ‌డంతో ఆమె భ‌ర్త తీవ్ర ఆగ్ర‌హావేశాల‌కు లోన‌య్యాడు. ఏకంగా వేదిక‌పైకి వెళ్లి.. విజేత‌కు ధ‌రింప‌జేసే కిరీటాన్ని లాక్కొని, నేల‌కేసి కొట్టాడు. విప‌రీతంగా అరుస్తూ ఆందోళ‌న సృష్టించాడు. అక్క‌డున్న సెక్యూరిటీ సిబ్బంది.. అత‌న్ని ప‌క్క‌కు తీసుకెళ్లారు.

కాగా, ఈ ఘటనపై అందాల పోటీల నిర్వాహకులు స్పందించారు. భార్యకు అన్యాయం జరిగిందని భావించి అతను అలా ప్రవర్తించాడని వివరణ ఇచ్చారు. అయితే న్యాయ నిర్ణేతలు సరైన నిర్ణయమే తీసుకున్నారని ఓ ప్రకటనలో తెలిపారు.

Exit mobile version