సంర‌క్ష‌ణ పేరుతో కుక్క‌ల‌కు హింస‌, ఫ్రిజ్‌లో ఐదు శున‌కాల మృత‌దేహాలు.. మ‌హిళ అరెస్టు

జంతు సంర‌క్ష‌ణ కేంద్రం పేరుతో సేవ చేస్తున్న‌ట్లు నటిస్తూ కుక్క‌ల‌ను హింసిస్తున్న ఓ మ‌హిళ‌ను అమెరికా (America) పోలీసులు అరెస్టు చేశారు. అంతే కాకుండా ఆమె వ్య‌క్తిగత ఫ్రిజ్‌లో ఐదు శున‌కాల మృత‌దేహాల‌ను గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆరిజోనాలోని చాండ్ల‌ర్‌లో 48 ఏళ్ల ఏప్రిల్ మెక్‌లాఫ్‌లిన్ అనే మ‌హిళ ఈ సంర‌క్ష‌ణ కేంద్రాన్ని తన ఇంట్లోనే నిర్వ‌హిస్తున్నారు.

ఆమె ఎప్పుడూ విచిత్రంగా ప్ర‌వ‌ర్తిస్తుండ‌టం, ఇంటి ప‌రిస‌రాల్లో తీవ్ర దుర్గంధం వ‌స్తుండ‌టంతో ఇరుగుపొరుగు వారు పోలీసుల‌కు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆవిడ ఇంటిపై రైడ్‌కు వ‌చ్చారు. ఆ కాంపౌండ్‌లోకి అడుగుపెట్ట‌గానే తీవ్ర దుర్గంధం వారిని ఉక్కిరిబిక్కిరి చేసింది. లోప‌లికి వెళ్ల‌డానికి ఇక అసాధ్యం అనుకుని అగ్నిమాప‌క సిబ్బందిని పిలిపించారు.


వారు మాస్కుల‌తో లోప‌లికి వెళ్లి.. ర‌సాయ‌నాలను జ‌ల్లిన త‌ర్వాత పోలీసులు ఇంటిని సోదా చేశారు. ఆ ఇంట్లో ఉన్న కుక్క‌ల్లో చాలా వాటిని రోజూ హింసిస్తున్న‌ట్లు గుర్తించారు. వాటి దీన‌స్థితిని చూసి పోలీసుల‌కు విష‌యం అర్థ‌మైంది. మొత్తం మీద 55 కుక్క‌లు తీవ్ర హింస‌కు (Dog Abuse) గురైన‌ట్లు గుర్తించి వాటిని చికిత్స‌కు పంపారు. వంటింట్లో సోదా చేస్తుండ‌గా దిగ్భ్రాంతి క‌లిగించే విధంగా ఫ్రిజ్‌లో ఐదు కుక్క‌ల మృత‌దేహాల‌ను గ‌మ‌నించి బ‌య‌ట‌కు తీశారు.

ఆ ఇంటిని సీల్ చేసి ఏప్రిల్‌ను అరెస్టు చేశారు. ఆ కుక్క‌ల‌కు నీరు, ఆహారం ఇవ్వ‌కుండా అవి చ‌నిపోవ‌డాన్ని చూస్తూ నిందితురాలు ఆనందించేద‌ని పోలీసుల ద‌ర్యాప్తులో తేలింది. అంతే కాకుండా వృద్ధురాలైన ఆమె త‌ల్లి పోష‌ణ‌ను కూడా గాలికొదిలేసినందున ఈ కేసునూ పోలీసులు త‌మ రిపోర్టులో చేర్చారు. అయితే కోర్టులో ఆమె త‌న త‌ప్పును ఒప్పుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. తాను ఒక సంవ‌త్స‌ర‌ కాలంగా ఎన్నో కుక్క‌ల‌ని ర‌క్షించాన‌ని కోర్టుకు తెలిపింది. ఆహార‌ పదార్థాల ప‌క్కన చ‌నిపోయిన కుక్క‌ల‌ను పెట్టుకోవ‌డం త‌ప్పేమీ కాదు క‌దా అని కోర్టునే ప్ర‌శ్నించింది.


Latest News