Site icon vidhaatha

నెల్లూరులో ఇంకో ధిక్కార స్వరం.. ఉదయగిరి నుంచి కూడా రీ సౌండ్..!!

విధాత‌: పెరుగుట విరుగుట కొరకే అన్నది నిజమయ్యేలా ఉంది. గత 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం పదికి పది అసెంబ్లీ సీట్లు సాధించి బంపర్ మెజార్టీలో భాగమైన నెల్లూరు జిల్లాలో ఇప్పుడు ఒకరి తరువాత ఇంకొకరు వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ కు ఎదురెల్లుతున్నారు.

ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి రూపంలో మొదలైన ముసలం ఇప్పుడు ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి (నెల్లూరు రూరల్) మీదుగా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి చేరిందని అంటున్నారు.

ఆనం రామనారాయణ రెడ్డి, శ్రీధరరెడ్డిలు టీడీపీలో చేరే సూచనలున్నాయి. వాళ్ళిద్దరిని ఏదోలా సెటిల్ చేయడమో, అక్కడ కొత్త ఇంఛార్జీని నియమించడమో జరుగుతున్న తరుణంలో ఇప్పుడు ఏకంగా మేకపాటి కుటుంబం నుంచే వ్యతిరేక గళం మొదలైంది. మేకపాటి రాజమోహన్ రెడ్డికి స్వయంగా సోదరుడు అయిన మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే ఇపుడు రీ సౌండ్ ఇస్తున్నారు.

తన నియోజకవర్గంలో పరిశీలకుడిగా ఉన్న ధనుంజయరెడ్డి మీద హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఎవరీ ధనుంజయరెడ్డి అని ఆయన నిలదీస్తున్నారు. ఆయన తెలుగుదేశం మనిషి అని సందేహిస్తున్నారు. ఆయన పార్టీకి ఎమ్మెల్యేలు మధ్య వారధిగా ఉండాలి కానీ తన సొంత నియోజకవర్గంలో చిచ్చు పెడుతున్నారు అని మండిపోతున్నారు. ఆయన వ్యవహారం తాను ముఖ్యమంత్రి జిల్లా మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి వద్దనే తేల్చుకుంటాను అని గట్టిగానే చెబుతున్నారు.

ఉదయగిరి నియోజకవరంలోని వరికుంటపాడు మండలం తూర్పు రొంపిదొడ్లలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇలా మాటల దాడి చేశారు. దీంతో వైసీపీకి నెల్లూరు తలనొప్పి మరింత గట్టిగానే అన్నట్లుగా అయింది. ఒక వైపు తాను వైఎస్ కుటుంబానికి వీర విధేయుడిని అని చెప్పుకుంటున్న చంద్రశేఖరరెడ్డి బాహాటంగా పార్టీ నియమించిన పరిశీలకుడి మీద విమర్శలు చేయడంతో అలజడి రేగుతోంది.

Exit mobile version