రైల్వే శాఖ‌కు తెలంగాణ బాకీ.. ఎంతంటే..?

భార‌తీయ రైల్వే శాఖ‌కు తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, క‌ర్ణాట‌క రాష్ట్రాలు భారీగా బ‌కాయిలు ఉన్న‌ట్లు వెల్ల‌డైంది. ఈ మూడు రాష్ట్రాలు సుమారు రూ. 9 వేల కోట్ల‌కు పైగా బ‌కాయిలు చెల్లించాల్సి ఉంది.

  • Publish Date - February 14, 2024 / 05:47 AM IST

న్యూఢిల్లీ : భార‌తీయ రైల్వే శాఖ‌కు తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, క‌ర్ణాట‌క రాష్ట్రాలు భారీగా బ‌కాయిలు ఉన్న‌ట్లు వెల్ల‌డైంది. ఈ మూడు రాష్ట్రాలు సుమారు రూ. 9 వేల కోట్ల‌కు పైగా బ‌కాయిలు చెల్లించాల్సి ఉంది. ప్రాజెక్టుల ఖ‌ర్చులు అంచ‌నాలు మించ‌డం వ‌ల్లే ఈ ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని అధికారులు పేర్కొన్నారు. కేర‌ళ‌, త‌మిళ‌నాడు రాష్ట్రాలు రైల్వే శాఖ‌కు ఎలాంటి బాకీలు లేవు. కానీ భూసేక‌ర‌ణ‌లో జాప్యం వ‌ల్ల ప్రాజెక్టులు నెమ్మ‌దిగా సాగుతున్నాయ‌ని పేర్కొన్నారు.


అయితే ఆయా రాష్ట్రాల్లో ఎన్నిక‌ల త‌ర్వాత మారుతున్న ప్ర‌భుత్వాలు, ఇత‌ర‌త్రా మార్పుల వ‌ల్ల రైల్వే ప్రాజెక్టుల్లో ఆల‌స్యం జ‌రుగుతున్న‌ద‌ని అధికారులు తెలిపారు. స‌మ‌యం ఎక్కువ‌గా తీసుకోవ‌డంతో ఖ‌ర్చు కూడా అధిగ‌మిస్తోంద‌న్నారు. నిధుల మంజూరులో జాప్యం, భూసేక‌ర‌ణ‌, ప్రాజెక్టుల అనుమ‌తుల‌కు ఆటంకం క‌లిగించ‌డం వ‌ల్లే ఈ బ‌కాయిలు ఏర్ప‌డుతున్నాయ‌ని పేర్కొన్నారు. కొత్త ప్ర‌భుత్వాలు ఏర్ప‌డ‌గానే ఆ ప్రాజెక్టు ప‌రిధిని మార్చ‌డంతో అవాంత‌రాలు ఏర్ప‌డుతున్న‌ట్లు చెప్పారు. దీంతో స‌మ‌యం మించిపోవ‌డం, ఖ‌ర్చు అధిక‌మ‌వ‌డం జ‌రుగుతుంద‌ని అధికారులు స్ప‌ష్టం చేశారు.


రైల్వే శాఖ‌కు తెలంగాణ రూ. 1,253 కోట్లు, ఏపీ రూ. 6,958 కోట్లు, క‌ర్ణాట‌క రూ. 928 కోట్ల బ‌కాయిలు చెల్లించాల్సి ఉంద‌ని అధికారులు పేర్కొన్నారు. అయితే సుమారు రూ. 7.18 ల‌క్ష‌ల కోట్ల విలువైన 459 మౌలిక స‌దుపాయాల ప్రాజెక్టుల‌ను(కొత్త లైన్లు, గేజ్ మార్పిడి, డ‌బ్లింగ్) 46,360 కిలోమీట‌ర్ల‌కు పైగా రైల్వే విస్త‌రిస్తోంది. మార్చి, 2023 నాటికి 11,872 కిలోమీట‌ర్ల రైలు మార్గాన్ని ప్రారంభించ‌గా, మిగిలిన వాటిలో చాలా వ‌ర‌కు ప‌నులకు ఆమోదం ల‌భించ‌లేదు. కొన్ని ప‌నులు నిర్మాణ ద‌శ‌లో ఉన్నాయి. రాష్ట్ర ప్ర‌భుత్వాలు త్వ‌రిత‌గ‌తిన భూసేక‌ర‌ణ‌, ఇత‌ర వ్య‌యాలు జ‌మ చేస్తే ప్రాజెక్టుల‌ను త్వ‌ర‌గా పూర్తి చేసేందుకు ఆస్కారం ఉంద‌న్నారు.


రెండు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టులకు 2024-25 కేంద్ర బడ్జెట్‌లో రూ.14,209 కోట్లు కేటాయించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో ఏపీ పరిధిలోని ప్రాజెక్టులకు రూ.9,138 కోట్లు కేటాయించగా, తెలంగాణ ప్రాజెక్టులకు రూ.5,071 కోట్లు కేటాయించారని చెప్పారు. నిరుడు బడ్జెట్‌ కేటాయింపుల కంటే ఏపీకి 8.7శాతం, తెలంగాణకు 14.7శాతం అదనంగా వచ్చినట్లు చెప్పారు. ఈ బడ్జెట్‌లో దక్షిణ మధ్యరైల్వే పరిఽధిలో కొత్తగా రెండు డబ్లింగ్‌ లైన్లు, ఒక బైపాస్‌ లైన్‌ను కేంద్రం మంజూరు చేసిందని, భద్రాచలం-డోర్నకల్‌ మధ్య రూ.770 కోట్లతో 54.65 కిలోమీటర్లను వచ్చే ఆర్థిక సంవత్సరంలో చేపడతామన్నారు. కాగా, దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అభివృద్ధి ప్రాజెక్టుల కోసం రూ.1650 కోట్లు కేటాయించారు.

Latest News