Site icon vidhaatha

Asia Cup | ఆసియా క‌ప్ టోర్నీకి జట్టుని ప్ర‌క‌టించిన బీసీసీఐ.. మ్యాచ్‌ల‌ని ఎక్క‌డ వీక్షించొచ్చంటే..!

Asia Cup |

వ‌రల్డ్ క‌ప్‌కి ముందు ఆసియా క‌ప్ టోర్నీ జ‌ర‌గ‌నుండ‌గా, ఈ సిరీస్ కూడా చాలా రంజుగా సాగ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. పాకిస్తాన్- ఇండియా ఫైట్ కోసం ప్రేక్ష‌కులు చాలా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఆగస్టు 30 నుంచి ఆసియా క‌ప్ 2023 టోర్నీ ప్రారంభం కానుండ‌గా, ఈ సిరీస్ కోసం 17మందితో కూడిన భార‌త జ‌ట్టుని బీసీసీఐ తాజాగా ప్ర‌క‌టించింది. రోహిత్ శర్మ కెప్టెన్‌గా, హార్ధిక్ పాండ్యా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించున్నారు.

జస్ప్రిత్ బుమ్రాని వైస్ కెప్టెన్‌గా తీసుకుంటార‌ని ప్ర‌చారం జ‌రిగిన వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందు ప్ర‌యోగాల‌కి పోకూడ‌ద‌ని బీసీసీఐ పెద్ద‌లు భావించిన‌ట్టు తెలుస్తుంది. ఈ టోర్నీలో రోహిత్‌తో గిల్ ఓపెనింగ్ చేయ‌నున్నాడు. విరాట్ కోహ్లీ వన్‌డౌన్‌లో ఆడనున్నాడు. ఇక కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ రీఎంట్రీ ఇవ్వబోతుండ‌గా సూర్యకుమార్ యాదవ్‌తో పాటు వెస్టిండీస్ టూర్‌లో అద‌ర‌గొట్టిన తిల‌క్ వర్మలకు కూడా చోటు దక్కింది.

ఇషాన్ కిషన్ కీప‌ర్‌గా చోటు ద‌క్కించుకోగా , రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ ఆల్‌రౌండర్లుగా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ఇక శిఖ‌ర్ ధావ‌న్‌ని ఆసియా క‌ప్‌కి ఎంపిక చేస్తార‌ని అందరు అనుకున్నా కూడా అత‌నికి మొండి చేయి ఇచ్చింది బీసీసీఐ. లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్‌ని కూడా ప‌క్క‌న పెట్ట‌డం అంద‌రికి ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది.

టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ కూడా ఆసియా కప్ 2023 జట్టులో చోటు ద‌క్కించుకోలేదు. ఇక ఆసియా క‌ప్ మ్యాచ్‌లు అన్ని కూడా పాకిస్తాన్,శ్రీలంక‌లో జ‌ర‌గ‌నుండ‌గా, టీమిండియా ఆడాల్సిన మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే జరుగుతాయి.శ్రీలంక‌లో జ‌రిగే మ్యాచ్‌లు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతాయి.

పాకిస్థాన్‌లో జరిగే ఆసియా కప్‌లోని అన్ని మ్యాచ్‌లు కూడా మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం అవుతాయి. ఈ మ్యాచ్‌ల‌ని స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో టీవీలో క్రికెట్ అభిమానులు వీక్షించవచ్చు. ఇక మొబైల్, ల్యాప్‌టాప్‌లో చూడాల‌ని అనుకునేవారు Disney+Hotstar యాప్‌లో చూడొచ్చు.

ఇక ఆసియా కప్ 2023 టోర్నీకి భారత జట్టు చూస్తే.. రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నారు. స్టాండ్ బై ప్లేయర్ గా సంజూ శాంసన్ ని తీసుకున్నారు.

Exit mobile version