ముంబై : మహారాష్ట్ర రాజధాని ముంబైలో నిర్మించిన దేశంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్(MTHL) ను ప్రధాని మోదీ ఇటీవలే ప్రారంభించిన సంగతి తెలిసిందే. ముంబైలోని సేవ్రీ నుంచి రాయ్‌గఢ్ జిల్లాలోని నవా శేవాను కలుపుతూ ఈ వంతెనను నిర్మించారు.
అయితే ఈ వంతెనపై తొలిసారిగా ఘోర ప్రమాదం జరిగింది. ఆరు లేన్ల రహదారి ఉన్న ఈ బ్రిడ్జిపై ఓ కారు వేగంగా దూసుకొచ్చి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. అనంతరం కారు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాద ఘటనను మరో కారులో వెళ్తున్న వారు చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఘటన నిన్న మధ్యాహ్నం 3 గంటలకు జరిగినట్లు తెలిసింది. ఇక ప్రమాదానికి గురైన కారు రాయ్‌గఢ్ జిల్లాలోని చిర్లే గ్రామానికి వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు, చిన్నారి సురక్షితంగా ఉన్నారని తెలిపారు. స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో మహిళ డ్రైవింగ్ చేస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు.
అరేబియా సముద్రం మీదుగా నిర్మించిన ఈ వంతెనకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి గౌరవార్థం అటల్ సేతుగా నామకరణం చేశారు. రూ. 21,200 కోట్ల వ్యయంతో ఆరు లేన్లుగా దీన్ని నిర్మించారు. ముంబై – నబీ ముంబైల మధ్య ప్రయాణానికి గతంలో 2 గంటల సమయం పట్టేది. కానీ ఈ వంతెన అందుబాటులోకి రావడంతో కేవలం 15 నుంచి 20 నిమిషాల్లో చేరుకోవచ్చు.
ఇక ముంబై, నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులకు త్వరగా చేరుకోవచ్చు. ముంబై నుంచి పుణె, గోవాకు త్వరగా చేరుకోవచ్చు. ఈ వంతెన మొత్తం పొడవు 21.8 కిలోమీటర్లు కాగా, 16 కిలోమీటర్లకు పైగా అరేబియా సముద్రంలో నిర్మించారు. భూకంపాలను సైతం తట్టుకొనేలా ఈ బ్రిడ్జిని నిర్మించారు. టూ వీలర్స్, ఆటోలు, ట్రాక్టర్లకు ఈ బ్రిడ్జిపైకి అనుమతి లేదు.