విధాత: అదృష్టమంటే ఇలా ఉండాలి. ఓ ఆటో డ్రైవర్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడై పోయాడు. 22 ఏండ్ల నుంచి ఎన్నో లాటరీ టికెట్లు కొనుగోలు చేసినప్పటికీ.. అతనికి ఆదివారం రాత్రి అదృష్టం వరించింది. అది కూడా టికెట్ కొనుగోలు చేసిన మరుసటి రోజే.. రూ.25 కోట్లు గెలుచుకుని, వార్తల్లోకి ఎక్కాడు.
కేరళలోని శ్రీవరహాం ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ అనూప్.. శనివారం రోజు ఓనం బంపర్ లాటరీలో భాగంగా TJ 750605 అనే లాటరీ టికెట్ కొన్నాడు. అయితే మొదట వేరే టికెట్ కొన్నప్పటికీ ఆ నంబర్ నచ్చక.. రెండోసారి TJ 750605 అనే టికెట్ కొనడం.. అతన్ని కోటీశ్వరుడిని చేసింది.
ఈ సందర్భంగా అనూప్ మాట్లాడుతూ.. మలేషియాలో చెఫ్‌గా స్థిర పడేందుకు ప్లాన్ చేసుకున్నానని, అందుకోసం రూ.3 లక్షలు కూడా బ్యాంకు రుణం పొందేందుకు సిద్ధపడ్డానని తెలిపాడు. ఇక లాటరీ తగలడంతో తనకు రూ.3 లక్షల రుణం అవసరం లేదని బ్యాంకు అధికారులకు ఫోన్ చేసి చెప్పానని తెలిపాడు.
ఇక మలేషియా కూడా వెళ్లను అని స్పష్టం చేశారు. పన్నులు కట్టగా వచ్చే రూ. 15 కోట్లతో మంచి ఇల్లు నిర్మించుకుంటానని, అప్పులు తీర్చుకుంటానని చెప్పాడు. ఇంకా మిగిలిన డబ్బులతో కేరళలో హోటల్ బిజినెస్ ప్రారంభిస్తానని, కష్టాల్లో ఉన్న తన బంధువులకు సహాయం చేస్తానని పేర్కొన్నాడు.
అసలు ఊహించలేకపోయాను..
తనకు లాటరీ తగులుతుందని ఊహించలేక పోయాను. 22 ఏండ్ల నుంచి లాటరీ టికెట్ కొనుగోలు చేస్తున్నప్పటికీ ఎప్పుడూ కూడా అదృష్టం వరించలేదు. రూ.5 వేల వరకు మాత్రమే గెలుచుకున్నాను. ఈ లాటరీలకు సంబంధించి టీవీలు చూడటం మానేశాను. అయితే ఆదివారం రాత్రి ఫోన్ చెక్ చేసుకున్నాను. లాటరీలో రూ. 25 కోట్లు గెలుచుకున్నట్లు మేసేజ్ వచ్చింది.
నమ్మలేక తన భార్యకు చూపించాను. రూ. 25 కోట్లు మనమే గెలుచుకున్నామని ఆమె కూడా స్పష్టం చేసింది. ఆ తర్వాత తాను లాటరీ టికెట్ కొనుగోలు చేసిన మహిళకు ఫోన్ చేసి లాటరీ టికెట్ నంబర్ పంపాను. ఆమె కూడా తనకే రూ. 25 కోట్లు వచ్చాయని చెప్పడంతో సంతోషపడ్డాను అని అనూప్ పేర్కొన్నాడు. భవిష్యత్‌లో కూడా మరిన్ని లాటరీ టికెట్లు కొంటానని అనూప్ తెలిపాడు.