Automobile sales | ఆటో మొబైల్‌ సేల్స్‌లో భారీ వృద్ధి.. ఫిబ్రవరిలో అమ్మకాలు ఎంత పెరిగాయంటే..

  • Publish Date - March 7, 2024 / 11:09 AM IST

Automobile sales: ఫిబ్రవరిలో వాహన రిటైల్‌ విక్రయాల్లో (Automobile Sales) భారీగా వృద్ధి నమోదైంది. వార్షిక ప్రాతిపదికన ఫిబ్రవరిలో వాహన రిటైల్‌ విక్రయాలు 13 శాతం పెరిగినట్లు ఆటోమొబైల్‌ డీలర్ల సమాఖ్య (ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటో మొబైల్‌ డీలర్స్‌ అసోషియేషన్‌-FADA) వెల్లడించింది. ప్రయాణికుల వాహనాలు, ద్విచక్ర వాహనాలు సహా అన్ని విభాగాల్లో అమ్మకాలు పుంజుకున్నాయని తెలిపింది. గత ఏడాది ఇదే నెలలో 17,94,866 యూనిట్ల విక్రయాలు నమోదవగా ఈసారి ఆ సంఖ్య 20,29,541కు చేరినట్లు పేర్కొంది.

2023 ఫిబ్రవరిలో ప్రయాణికుల వాహన విక్రయాలు 2,93,803 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈసారి అవి 12 శాతం పెరిగి 3,30,107కు చేరాయి. ఏ సంవత్సరం చూసుకున్నా ఫిబ్రవరిలో ఈ విభాగంలో ఇప్పటివరకు ఇవే రికార్డు విక్రయాలని ఫాడా తెలిపింది. కొత్త కార్ల విడుదల, వాహనాలు అందుబాటులో ఉండటమే అందుకు దోహదం చేసినట్లు వివరించింది.

అదేవిధంగా ద్విచక్ర వాహన అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 13 శాతం పెరిగి 14,39,523 యూనిట్లకు చేరాయి. గ్రామీణ ప్రాంతాల్లో గిరాకీ, ప్రీమియం మోడళ్లకు డిమాండ్‌, ఎంట్రీ లెవెల్‌ బైక్‌లకు ఆదరణ వంటి అంశాలు విక్రయాలకు దన్నుగా నిలిచాయని ఫాడా తెలిపింది. పెళ్లిళ్ల సీజన్‌, ఆర్థిక పరిస్థితులు మెరుగవ్వడం కూడా కలిసొచ్చినట్లు పేర్కొంది.

వాణిజ్య వాహన విక్రయాలు క్రితం ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే ఐదు శాతం పెరిగి 88,367 యూనిట్లకు చేరాయి. ఎన్నికల సీజన్‌ నేపథ్యంలో కొనుగోళ్ల వాయిదా వంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ విభాగంలో వృద్ధి నమోదు కావడం విశేషమని ఫాడా అభిప్రాయపడింది. అదేవిధంగా త్రిచక్ర వాహన అమ్మకాలు 24 శాతం పెరిగి 94,918 యూనిట్లకు చేరాయి. ట్రాక్టర్ల విక్రయాలు 11 శాతం పుంజుకొని 76,626కు పెరిగాయి.

వాహన విక్రయాలకు రాబోయే రోజుల్లోనూ సానుకూలతలు ఉన్నాయని ఫాడా అధ్యక్షుడు మనీశ్‌ రాజ్‌ సింఘానియా చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో వాతావరణం ప్రోత్సాహకరంగా ఉందన్నారు. ప్రీమియం, ఎంట్రీ లెవెల్‌ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ ఉందని తెలిపారు. ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో వాణిజ్య, త్రిచక్ర వాహన విక్రయాలు సైతం పెరుగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.

Latest News