Pradeep Gupta | 13 రాష్ట్రాల్లో ఎన్డీయే ఎదురీత?

కేంద్రంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తహతహలాడుతున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 13 రాష్ట్రాల్లో ఎదురీదే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు

  • Publish Date - April 19, 2024 / 06:00 PM IST

కొత్తగా సీట్లు గెలుచుకునే అవకాశాల్లేవు
పాతవి నిలుపుకోవడమే ఆ పార్టీకి సవాల్‌
యాక్సిస్‌ మై ఇండియా ఎండీ ప్రదీప్‌ గుప్తా

కేంద్రంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తహతహలాడుతున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 13 రాష్ట్రాల్లో ఎదురీదే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ మేరకు సెఫాలజిస్ట్‌, యాక్సిస్‌ మై ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రదీప్‌గుప్తా పేర్కొన్నారన్న వార్త ఇంటర్నెట్‌, సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తున్నది.

కొత్తగా ఈ రాష్ట్రాల్లో సీట్లు పెంచుకునే అవకాశాలు లేవని, అదే సమయంలో కొన్ని సీట్లు కోల్పోయే పరిస్థితి ఉన్నదని ప్రదీప్‌ గుప్తా చెప్పారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయేకు 352 సీట్లు వచ్చాయి. ఇప్పుడు తాము 400 సీట్లు దాటుతామని బీజేపీ చెప్పుకొంటున్నది. అంటే ఇప్పుడు ఉన్న సీట్లు అన్నీ గెలవడంతోపాటు అదనంగా 48 స్థానాల్లో ఎన్డీయే విజయం సాధించాల్సి ఉంటుంది.

గతంలో అనేక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను మై యాక్సిస్‌ ఇండియా విజయవంతంగా అంచనా వేసిన విషయం తెలిసిందే. కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ స్పష్టమైన మెజార్టీ సాధిస్తుందని 2023 మేలో వేసిన అంచనా వాస్తవరూపం దాల్చింది. మహారాష్ట్ర, బీహార్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, గుజరాత్‌, రాజస్థాన్‌, జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, గోవాతోపాటు.. పలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 257 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి.

ఇక్కడ 2019 ఎన్నికల్లో ఎన్డీయే 238 సీట్లలో గెలుపొందిందని తమ వెబ్‌సైట్‌కు ప్రదీప్‌ గుప్తా చెప్పారని మనీకంట్రోల్‌ పేర్కొన్నది. ‘ఈ రాష్ట్రాల్లో 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే 93 శాతం స్ట్రయిక్‌రేట్‌ కలిగి ఉన్నది. అయితే.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో అధికార కూటమి ఇక్కడ మరిన్ని సీట్లు గెలిచే అవకాశాలు లేవు. పైగా దాని సంఖ్య తగ్గొచ్చు. 400 సీట్లు సాధించాలంటే అధికార కూటమి కనీసం ఉన్న సీట్లు కాపాడుకోవాల్సి ఉంటుంది’ అని గుప్తా చెప్పారని మనీ కంట్రోల్‌ తెలిపింది.

మహారాష్ట్ర, బీహార్‌, కర్ణాటక, ఢిల్లీల్లో రాజకీయ సమీకరణాల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నదని ప్రదీప్‌ గుప్తా పేర్కొన్నారు. మహారాష్ట్రలోని 48 సీట్లు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌ తర్వాత దిగువ సభకు అత్యధిక సభ్యులను పంపే రాష్ట్రం మహారాష్ట్ర. ‘మహారాష్ట్రలో కొత్త కూటములు ఉన్నాయి. రెండు ప్రధాన పార్టీలైన శివసేన, ఎన్సీపీల్లో చీలికలు వచ్చాయి.

గత లోక్‌సభ ఎన్నికలతో పోల్చితే రాజకీయ సమీకరణాలు కూడా మారిపోయాయి. అదే విధంగా కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ భారీ విజయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అది అక్కడ ఆ పార్టీ మరిన్ని సీట్లు గెలుచుకునేందుకు దోహదం చేస్తుంది. ఢిల్లీలో ఇప్పటికే ఆమ్‌ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌ సీట్ల సర్దుబాటు చేసుకున్నాయి’ అని గుప్తా పేర్కొన్నారు. 2019లో ఉద్ధవ్‌ ఠాక్రె నేతృత్వంలోని అవిభాజ్య శివసేన బీజేపీతో సీట్ల సర్దుబాటు చేసుకున్నది. 23 సీట్లలో తన అభ్యర్థులను నిలిపి.. 18 మందిని గెలిపించుకోగలిగింది.

బీజేపీ తాను పోటీ చేసిన 25 స్థానాల్లో 23 గెలుచుకున్నది. 2019లో ఉత్తరప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, ఒడిశా, తెలంగాణ, అసోం, ఏడు ఈశాన్య రాష్ట్రాల్లో మొత్తం 185 సీట్లు ఉన్నాయి. ఇందులో ఎన్డీయే కూటమి 109 సీట్లు అంటే 60శాతం సీట్లు గెలుచుకున్నది. ఈ రాష్ట్రాల్లో బీజేపీ సీట్ల సంఖ్యను పెంచుకునే అవకాశం ఉన్నది. అయితే.. ఈ రాష్ట్రాల్లో 40శాతం స్ట్రయిక్‌ రేట్‌ 40 శాతంతో 76 సీట్లను గెలుచుకున్న రీత్యా ఇక్కడ ఎన్డీయే కూటమి లబ్ధిపొందుతుందని కచ్చితంగా చెప్పలేం’ అని గుప్తా పేర్కొన్నారు.

తమిళనాడు, కేరళ, పంజాబ్‌, ఆంధ్రప్రదేశ్‌, కశ్మీర్‌లో ప్రతిపక్ష పార్టీలు గత ఎన్నికల్లో 95శాతం స్ట్రయిక్‌ రేటును కలిగి ఉన్నాయని ప్రదీప్‌ గుప్తా పేర్కొన్నారు. ఇక్కడ కూడా రాజకీయ సమీకరణాలు మారిపోయాయని అన్నారు. ఇక్కడ ఎన్డీయేకు సీట్లు పెరిగే అవకాశం ఉన్నా.. కచ్చితంగా సానుకూల ఫలితాలు వస్తాయని చెప్పలేమని తెలిపారు. ఈ రాష్ట్రాల్లో 101 సీట్లు ఉన్నాయి. ఎన్డీయే ఐదు సీట్లలో మాత్రమే గతంలో గెలిచింది. ఇక్కడ ప్రతిపక్షాలకు 96 సీట్లు ఉన్నాయి.

ఈవీఎంలపై జనంలో ఆందోళనల్లేవు!

ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల విషయంలో భారతదేశ ఓటర్లకు ఎలాంటి ఆందోళనలు లేవని ప్రదీప్‌ గుప్తా పేర్కొన్నారు. ‘గడిచిన 11 ఏళ్లలో యాక్సిస్‌ మై ఇండియా రెండు లోక్‌సభ ఎన్నికలతోపాటు 64 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విజయవంతంగా అంచనా వేసింది. కానీ ఎక్కడా రిగ్గింగ్‌ అనే ఆందోళనే వ్యక్తం కాలేదు’ అని ఆయన తెలిపారు. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలపై వివాదాలను ప్రజలు పట్టించుకోవడం లేదని, ఈ అంశాన్ని రాజకీయ పార్టీలే లేవనెత్తుతున్నాయని అన్నారు.

ఇండియా కూటమి పరిస్థితి!

ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలు నిజంగా కలిసి లేరని ప్రదీప్‌ గుప్తా వ్యాఖ్యానించారు. వాళ్ల సీట్ల సర్దుబాట్లు కూడా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉన్నాయని చెప్పారు. కొత్త సంకీర్ణం ఊహించిన విధంగా రూపుదిద్దుకోలేదని అన్నారు. ‘ఇప్పుడు ఎన్డీయేలో ఉన్న బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ ప్లాన్‌ చేసిన ప్రకారం సంకీర్ణం రూపుదిద్దుకోలేదు. దానిని బెంగాల్‌లో గమనించవచ్చు. అక్కడ కాంగ్రెస్‌కు తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఇదే పరిస్థితి అనేక రాష్ట్రాల్లో ఉన్నది’ అని ఆయన చెప్పారు. ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు దేశ వ్యాప్తంగా 350 సీట్లలో సీట్ల సర్దుబాటు చేసుకున్నాయి. కానీ వంద సీట్లలో మాత్రమే అవి కలిసికట్టుగా పోటీ చేస్తున్నాయి’ అని ప్రదీప్‌ గుప్తా తెలిపారు. ‘కూటమితోపాటు అన్ని పార్టీలూ వారివారి మార్గాల్లో బలంగా ఉన్నాయని చెప్పగలను’ అని గుప్తా తెలిపారు.

Latest News