Site icon vidhaatha

Ayurvedic: ఆయుర్వేద వైద్యం ఆరోగ్యానికి ఎంతో మేలు: హోంమంత్రి మహమూద్ అలీ

భద్రాచలం: ప్రముఖ ఆయుర్వేద(Ayurvedic) వైద్యుడు డా.జమాల్ ఖాన్(Jamal Khan) ఆయుర్వేద ఔషధ వనమూలిక వైద్య సేవలను గుర్తించి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి సయ్యద్ మహమూద్ అలీ(Home Minister Mahmood Ali)సాదరంగా ఆహ్వానించి తన వైద్య సేవలను కొనియాడుతూ శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా డా జమాల్ ఖాన్‌తో క‌లిసి హోంమంత్రి మాట్లాడుతూ వనమూలిక వైద్యం ఎంతో విశిష్టతతో కూడినదని అన్నారు. పురాతన కాలం నుండి మానవాళికి ఉపయోగపడే ఆయుర్వేద వైద్య విధానం గూర్చి ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు. గ్లోబల్ వార్మింగ్‌తో రోజు రోజుకు వాతావరణం వేడెక్కి భూమిపై జీవరాశి మనుగడకే సవాలుగా మారిందన్నారు. మనిషి స్వార్ధానికి అడవులను విచక్షారహితంగా నరికి వేయడంతో ఎంతో విలువైన ఔషధ మొక్కలు అంతరించి పోయాయని అన్నారు.

మానవ మనుగడకు అవసరమయ్యే వనమూలికా ఔషధ మొక్కలు నాటి ప్రజలలో చైతన్యం తీసుకువచ్చి భావి తరాలకు ప్రాణ వాయువును అందించాలన్నారు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఇలాంటి వైద్యాన్ని హైద్రాబాద్ వంటి మహానగరంలో కూడా క్యాంప్ నిర్వహించాలని ఆయన కోరగా జామాల్ ఖాన్ సమాధానం ఇస్తూ వనమూలికలు సరిపడా లభించడంలేదని, సిబ్బంది, మరికొంత మంది వైద్యులు అవసరం ఉంటుందని అన్నారు.

అంతే గాక కొంత మంది అల్లోపతి వైద్యులకు ఆయుర్వేదంలో శిక్షణ ఇచ్చి తద్వారా ఎక్కువ పేషెంట్లకు వైద్య సేవలందించలన్నారు. ఔషధ మొక్కలు పెంచేందుకు గాను అటవీశాఖ అధికారులతో మాట్లాడి ఏ మేరకు ఔషధ మొక్కలు అవసరం ఉంటాయో తెలియజేస్తే అటవీశాఖ వారికి ఆదేశాలు జారీ చేసి, ఔషధ మొక్కలు పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి తెలిపారు.

అనంతరం ముస్లిం ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ముజాహిద్ హుస్సేన్ మాట్లాడతూ తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం నిమ్మలగూడెం గ్రామంలో, ఒడిస్సా రాష్ట్రంలోని మల్కనగిరి జిల్లా, మోటు తాలుకా ఇస్మాయిల్ నగర్, ఎటపాక ప్రాంతాల్లో వారాంతపు క్యాంపులను నిర్వహించి వేల మంది రోగులకు అల్పాహార భోజనాలు ఏర్పాటు చేస్తూ కనీసం కన్సల్టెన్సీ ఫీజు కూడా లేకుండా ఉదార భావంతో కేవలం ఆయుర్వేద మందులపై ఖర్చులు మాత్రమే తీసుకుంటూ రోగులకు ఇస్తున్నారని కొనియాడారు.

విష సర్పాల బారినపడి మృత్యువుకు చేరువవుతున్న దశలో సుమారు 25 వేల మంది పాము కాటు బాధితులను ఉచితంగా మందులను అందించి ప్రాణభిక్ష పెట్టారని తెలిపారు. కరోనా కష్టకాలంలో లక్షలాదిమంది కరోనా బాధితులకు ఉచితంగా ఆయుర్వేద పద్ధతిలో ప్రత్యేకమైన ఔషధాన్ని తయారుచేసి అందించి ప్రాణదాతగా నిలిచారన్నారు. అనాదిగా ఆయుర్వేదమే మానవాళికి ఆరోగ్యాన్ని ప్రసాదించే దివ్య ఔషధ గుణాలున్న సంజీవని అని తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో భద్రాచలం బిఆర్ఎస్ పార్టీ మాజీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మానే రామకృష్ణ, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి సీనియర్ జర్నలిస్ట్ కర్ర అనిల్ రెడ్డి, ఎస్కే షాజహాన్ తదితరులు ఉన్నారు.

Exit mobile version