ప్రతి క్షణం ప్రజల కోసమే పనిచేశా: బండి సంజయ్

‘‘నేనేనాడు పదవీ కాలాన్ని ఆస్తులు సంపాదించడానికి వాడుకోలేదు.. ప్రతి క్షణం ప్రజల కోసం పోరాడేందుకే సమయాన్ని వెచ్చించా... ప్రతి నిమిషం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే పనిచేశా...

  • Publish Date - April 22, 2024 / 02:47 PM IST

కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి కోసం పరితపించా
కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్ధులు చేసిందేమిటో బేరీజు వేయండి
మోదీ సర్కార్ కు, కాంగ్రెస్ కు ఉన్న తేడాను గమనించండి
కెప్టెన్ లేకుండా ఎన్నికల్లోకి వెళుతున్న దుస్థితిలో కాంగ్రెస్
దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలివి.. ఆలోచించి తీర్పు ఇవ్వండి
బార్ అసోసియేషన్ సభ్యులను కోరిన బండి సంజయ్

విధాత బ్యూరో, కరీంనగర్: ‘‘నేనేనాడు పదవీ కాలాన్ని ఆస్తులు సంపాదించడానికి వాడుకోలేదు.. ప్రతి క్షణం ప్రజల కోసం పోరాడేందుకే సమయాన్ని వెచ్చించా… ప్రతి నిమిషం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే పనిచేశా…గత ఐదేళ్లలో నేను చేసింది ఏమిటో… కాంగ్రెస్, బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు చేసింది ఏమిటో బేరీజు వేసి ప్రజలకు వివరించాలని కోరుతున్నా..’’ అన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్. సోమవారం హుస్నాబాద్ విచ్చేసిన బండి సంజయ్ కుమార్ స్థానిక బార్ అసోసియేషన్ నాయకులను కలిశారు. ఈ సందర్బంగా న్యాయవాదులు ఆయనను శాలువాతో సన్మానించారు..

‘‘ఎంపీగా ఐదేళ్లకాలంలో కరీంనగర్ కు రూ.12 వేల కోట్ల నిధులు తీసుకొచ్చానని, ఇందులో జాతీయ రహదారుల నిర్మాణ పనులకే రూ.5వేల కోట్లకుపైగా నిధులు వచ్చాయని, గ్రామాల్లో రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పనకు ఐదేళ్లలో పెద్దపీట వేయడం జరిగిందని తెలిపారు. కరీంనగర్ లో ఏం అభివృద్ధి జరిగిందని కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని వాపోయారు.

‘‘ఎంపీగా ప్రజల పక్షాన రాష్ట్రమంతా తిరిగి ఏ విధంగా పోరాడానో మీకు తెలుసు. రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, మహిళలు, విద్యార్థులుసహా అన్ని వర్గాల పక్షాల కొట్లాడాను,లాఠీదెబ్బలు తిన్నాను ,వందకుపైగా కేసులు ఎదుర్కొన్నాను, చివరకు జైలుకు పంపినా భయపడకుండా కేసీఆర్ ప్రభుత్వంపై పోరాడిన చరిత్ర తనదని చెప్పారు.

ఈ సందర్భంగా మోదీ సర్కార్ కు, కాంగ్రెస్ సర్కార్ కు మధ్య ఉన్న తేడాను గమనించాలని కోరారు. ‘‘370 ఆర్టికల్ రద్దు, ట్రిపుల్ తలాఖ్ రద్దు, అయోధ్య రామ మందిర నిర్మాణం వంటి విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్న చరిత్ర మోదీకే దక్కుతుందన్నారు. ప్రస్తుత లోకసభ ఎన్నికలు ఈ దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలివి. దేశ ప్రధానిని నిర్ణయించేవని, కెప్టెన్ లేకుండా క్రీడలు ఆడలేం. అట్లాగే ప్రధాని అభ్యర్ధి లేకుండా ఎన్నికల్లోకి వెళ్లలేం. బీజేపీ టీం పక్షాన మోదీ కెప్టెన్ గా ఉన్నారు. మరి కాంగ్రెస్ కూటమి పక్షాన కెప్టెన్ ఎవరు? అంటూ ప్రశ్నించారు. ఇండియా కూటమి పక్షాన ప్రధాని అభ్యర్ధి ఎవరో తేల్చలేని దుస్థితిలో కాంగ్రెస్ ఉందని,కాబట్టి అన్నీ ఆలోచించి తీర్పు ఇవ్వాలని ఆయన న్యాయవాదులకు విజ్ఞప్తి చేశారు.

Latest News