విధాత: ఉపాయంతో అపాయాలు దాటవచ్చంటారు పెద్దలు! ఆ సామెతను అక్షరాలా ఆచరిస్తున్నారు ఒడిశాలోని గజపతి జిల్లా డీజైపూర్ (D jaipur of Gajapathi district in Odisha) ప్రాంత గిరిజనులు! వారు రోజూ వెళ్లే మార్గంలో ఒక వాగు ప్రవహిస్తూ ఉంటుంది.
వాగులో నీళ్లు లేకపోతే ఇబ్బంది లేదు.. అదే వాగు పొంగిందంటే ఆ ఊరికి దారి బంద్ అయితది. కానీ.. ఆ గ్రామ ప్రజలు మాత్రం ఉధృతంగా పొంగుతున్న వాగును సైతం అవలీలగా దాటేందుకు ఒక మార్గం ఎంచుకున్నారు.
అదే ఆ వాగు ఒడ్డున ఉన్న మర్రిచెట్టు! మర్రిచెట్టు ద్వారా ఎలా దాటడం అనుకుంటున్నారా? ఏమీ లేదు.. ఆ మర్రిచెట్టు ఊడలు వాగు అవతలి ఒడ్డు వరకు వ్యాపించి ఉన్నాయి. చక్కగా నడిచేందుకు సరిపడా మందంతో ఉన్న ఆ ఊడకు అటూ ఇటూ వెదురు కర్రలు కట్టి దానిని వంతెన (Bamboo Bridge) లా మలిచారు. మిగిలిన కాస్త దూరానికి కూడా కర్రలతో వంతెన చేసుకుని దానికి కలిపారు. ఆ మర్రి చెట్టు కూడా గిరిజనుల కష్టాలు తీర్చేందుకే ఉన్నానన్నట్టు.. సులభంగా ఎక్కేందుకు వీలుగా ఉంటుంది.
సులభంగా మర్రిచెట్టు ఎక్కిన ప్రజలకు.. కింద పడిపోకుండా నడిచేందుకు వీలుగా ఏర్పాటు చేసుకున్న వెదురు బొంగుల సహాయంతో కొంచెం కష్టమైనా.. ఇబ్బంది లేకుండా దాటి వెళుతున్నారు. దీనికి సంబంధించిన ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్నది. గిరిజనుల ఈ కష్టం ప్రభుత్వం దృష్టికి వచ్చిందో లేదో. ఇది అక్కడి ప్రభుత్వం దృష్టికి వెళ్లి.. అక్కడ ఒక చిన్న వంతెన వస్తుందని, ఆ ప్రజల కష్టం తీరుతుందని మనం కూడా ఆశిద్దాం!