Bharat rice | విధాత : బహిరంగ మార్కెట్‌లో ఎప్పటికప్పుడు పెరుగుతున్న బియ్యం ధరలను నియంత్రించే చర్యలో భాగంగా కేంద్రం భారత్ బ్రాండ్ పేరుతో 29రూపాయలకే కిలో బియ్యంను అందించాలని నిర్ణయించింది. గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో సైతం ఈ అంశాన్ని ప్రకటించింది. ఎఫ్‌సీఐ ద్వారా భారత్ బ్రాండ్ రైస్ పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే భారత్ అటా, భారత్ దాల్ పేరుతో గోధుమపిండి, శనగపప్పు లను తక్కువ ధరలకు ప్రవేశపెట్టి విజయవంతంగా పంపిణీ చేస్తుండటంతో ఇప్పుడు ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు భారత్ రైస్ పంపిణీ చేయాలని నిర్ణయించింది.
ఎన్నికలకు ముందు పెరుగుతున్న నిత్యావసర, ఆహార పదార్థాల ధరలను అదుపులోకి తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా భారత్ బ్రాండ్ రైస్‌ను మార్కెట్‌లోకి తేనుంది. నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (నాఫెడ్), నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ అఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌సీసీఎఫ్), ఎఫ్‌సీఐల ద్వారా భారత్ బ్రాండ్ రైస్‌ను మార్కెట్‌లో పంపిణీ చేస్తారని భావిస్తున్నారు.