Site icon vidhaatha

11న విశాఖకు ప్రధాని.. భోగాపురం ఎయిర్పోర్టు కేసులన్నీ క్లియర్

శంకుస్థాపనకు ఏపీ సర్కారు ఏర్పాట్లు

విధాత: ఈనెల 11న ప్రధాని మోడీ వివిధ ప్రాజెక్టుల శంకుస్థాపనకు విశాఖ వస్తున్న తరుణంలో జగన్ ప్రభుత్వానికి హైకోర్టు నుంచి ఓ తీపి కబురు వచ్చింది. ఆ ఎయిర్పోర్టుకి సంబంధించి కోర్టులో రైతులు వేసిన కేసులన్నీ కొట్టేస్తూ, ఎయిర్పోర్టు నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లేందుకు జగన్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

ప్రధాని విశాఖ పర్యటనలో విశాఖ రైల్వే జోనుకు శంకుస్థాపన చేస్తారు. ఇంకా వేల కోట్ల పెట్టుబడితో విశాఖ ఆయిల్ రిఫైనరి విస్తరణ పనులు కూడా ప్రారంభిస్తారు. ఇదే తరుణంలో భోగాపురం ఎయిర్‌పోర్టు శంకుస్థాపన పని కూడా చేపడతారని ప్లాన్ వేశారు. కానీ కోర్టు కేసులు తేలకపోవడంతో ఈ ప్రాజెక్టును ప్రధాని షెడ్యూల్లో చేర్చలేదు.

అయితే ఇప్పుడు కోర్టు ఈ కేసులన్నీ కొట్టేయడంతో ఈ ఎయిర్పోర్టు శంకుస్థాపన ప్రక్రియను కూడా ప్రధాని షెడ్యూల్లో చేర్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. మొత్తం 2700 ఎకరాల భూసేకరణ కోసం ప్రభుత్వం గతంలో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 2200 ఎకరాలు విమానాశ్రయం కోసం మిగిలిన 500 ఎకరాలు అనుబంధ కార్యకలాపాల కోసం వినియోగించాలని నిశ్చయించింది.

ఎయిర్పోర్టు కోసం సేకరించాల్సిన 2200 ఎకరాల్లో 2064 ఎకరాలు ప్రభుత్వం ఇప్పటికే సేకరించింది. మిగిలిన భూముల సేకరణలో ఇబ్బందులు తలెత్తాయి. ఇప్పుడు హైకోర్టు ఈ సమస్యను పరిష్కరించడంతో భూ సేకరణ పూర్తి కానుంది. హైకోర్టు తీర్పుతో భోగాపురం ఎయిర్ పోర్టు భూసేకరణలో తలెత్తిన ఇబ్బందులు సమసిపోవడంతో ప్రధాని మోడీ విశాఖ టూర్‌లో దీనికి శంకుస్థాపన చేయించాలని జగన్ ప్రభుత్వం యోచిస్తోంది.

వాస్తవానికి మొత్తం 14 ప్రాజెక్టుల వరకూ శంకుస్థాపన జాబితాలో చేర్చినా వాటిలో 8 ప్రాజెక్టులకు మాత్రమే ప్రధాని కార్యాలయం అనుమతి ఇచ్చినట్టు సమాచారం. దీంతో మిగతా ప్రాజెక్టులను కూడా ఇందులో చేర్చేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది ఈ విమానాశ్రయానికి చంద్రబాబు ప్రభుత్వం 2019లోనే శంకుస్థాపన చేసింది. అయితే భూసేకరణకు ఇబ్బందులు ఎదురయ్యాయి.

దీంతో ఆ ప్రాజెక్టు అక్కడే ఆగిపోయింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. తాజాగా ఆ ప్రాజెక్టును జీఎమ్మార్ సంస్థకు అప్పగించారు. ఎయిర్పోర్టు ఇంకా రైల్వే జోన్ ఈ రెండూ శంకుస్థాపన జరిగితే రాజకీయంగా తమకు ఉపయోగపడుతుందని, ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో మంచి ఫలితాలు సాధించవచ్చని వైఎస్సార్సీపీ భావిస్తోంది.

Exit mobile version