Billionaire’s Love Story | ఆమె కోసం ఆనంద్‌ మహీంద్రా పరీక్షలనే పక్కన పెట్టేశాడు.. బ్యూటీఫుల్‌ లవ్‌స్టోరీ..!

  • Publish Date - March 26, 2024 / 03:26 AM IST

Billionaire’s Love Story : మహీంద్రా గ్రూప్‌ సంస్థల చైర్మన్‌, ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ గోపాల్‌ మహీంద్రా గురించి తెలియని వారు చాలా తక్కువగా ఉంటారు. ఆనంద్‌ మహీంద్రాగా ఆయన ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. నెటిజన్‌లలో మంచి క్రేజ్‌ సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆయన అందమైన ప్రేమ కథ కూడా సోషల్‌ మీడియాలో ఇంటరెస్టింగ్‌ టాపిక్‌గా మారింది.

ఆనంద్‌ మహీంద్రా టీనేజ్‌లోనే ప్రేమలో పడ్డారు. బాలీవుడ్‌ హీరో స్టైల్‌లో ఒక అమ్మాయికి తన లవ్‌ను ప్రపోజ్‌ చేసి ఆమె మనసు గెలుచుకున్నారు. ఆమెతో ఆనంందంగా గడపడం కోసం సెమిస్టర్‌ పరీక్షలను సైతం పక్కనపెట్టేశారు. ఈ బ్యూటీఫుల్‌ లవ్‌ స్టోరీ వివరాల్లోకి వెళ్తే.. అప్పట్లో ఆనంద్‌ మహీంద్రా హార్వర్డ్‌ యూనివర్సిటీలో చదువుతుండేవారు. ఒకసారి ఆయన కాలేజ్‌ ఎసైన్‌మెంట్‌ కోసం ఒక ఫిల్మ్‌ షూట్‌ చేయడానికి ఇండోర్‌కు వచ్చారు. అక్కడే ఆయన ఓ 17 ఏళ్ల అందమైన అమ్మాయిని చూశారు. చూసీచూడగానే ఆమెతో ప్రేమలో పడిపోయారు.

ఆ అమ్మాయి పేరు అనురాధ. ఆమెను చూసిన తర్వాత ఆనంద్‌ మహీంద్రాకు తిరిగి హార్వర్డ్‌కు వెళ్లాలనిపించలేదు. ఆమెతోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. ఆమెతో ఆనందంగా గడపడం కోసం ఏకంగా ఒక సెమిస్టర్‌ పరీక్షలను కూడా రాయకుండా వదిలేశారు. అప్పట్లో అది ఎంత పెద్ద నిర్ణయమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనురాధతో పీకల్లోతు ప్రేమలో పడిపోయిన ఆనంద్‌ మహీంద్రా ఏమాత్రం ఆలస్యం చేయలేదు. తన అమ్మమ్మ ఇచ్చిన ఉంగరంతో బాలీవుడ్‌ హీరో స్టైల్‌లో ఆమెకు లవ్‌ ప్రపోజ్‌ చేశారు.

అంతే.. ఆనంద్‌ మహీంద్రా ప్రపోజల్‌ను అనురాధా మహీంద్రా యాక్సెప్ట్‌ చేసింది. దాంతో 1985 జూన్‌ 17న పెద్దల సమక్షంలో వాళ్ల పెళ్లి అంగరంగ వైభోగంగా జరిగింది. అనురాధ పేరు అనురాధా మహీంద్రాగా మారిపోయింది. ఇప్పుడు అనురాధ మహీంద్రా ఆనంద్‌ మహీంద్రాకు భార్య మాత్రమే కాదు. ఒక ప్రసిద్ధ లగ్జరీ లైఫ్‌స్టైల్‌ మ్యాగజీన్‌ ‘వెర్వ్‌’ వ్యవస్థాపకురాలు. ‘మ్యాన్స్‌ వరల్డ్‌’ మ్యాగజీన్‌కు సహ వ్యవస్థాపకురాలు.


అనురాధా మహీంద్రా ముంబైలో జన్మించారు. ప్రతిష్ఠాత్మక సోఫియా కళాశాలలో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు. ఆనంద్‌ మహీంద్రాతో పెళ్లి తర్వాత దంపతులిద్దరూ బోస్టన్‌ విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి అమెరికా వెళ్లారు. అనురాధ మహీంద్రా బోస్టన్‌ విశ్వవిద్యాలయంలో కమ్యూనికేషన్‌ ప్రోగ్రామింగ్‌ చేశారు. అనంతరం జర్నలిజం, పబ్లిషింగ్‌లో తన కెరియర్‌ను ప్రారంభించారు.

Latest News