Site icon vidhaatha

Bishnupur Lok Sabha | విష్ణుపూర్‌ లోక్‌సభ స్థానంలో ఇంట్రెస్టింగ్ ఫైట్‌.. మాజీ భార్యాభర్తలే ప్రధాన ప్రత్యర్థులు..!

Bishnupur Lok Sabha : విష్ణుపూర్‌ (Bishnupur)..! ఇది పశ్చిమబెంగాల్‌లోని లోక్‌సభ నియోజకవర్గం..! ఈ నియోజకవర్గ ఎన్నిక ఇప్పుడు పశ్చిమబెంగాల్‌తోపాటు దేశమంతటా చర్చనీయాంశమైంది. ఆ నియోజకవర్గంలో మాజీ భార్యాభర్తలే ప్రధాన ప్రత్యర్థులుగా బరిలో నిలువడం అందుకు కారణం. విష్ణుపూర్‌లో బీజేపీ నుంచి సౌమిత్రా ఖాన్‌ (Saumitra Khan), తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి సుజతా మోండల్ (Sujata Mondal) బరిలో దిగుతున్నారు. వీరిద్దరూ మాజీ భార్యభర్తలు. అందుకే ఆ నియోజకవర్గ ఎన్నిక ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది.

ఇక వివరాల్లోకి వెళ్తే.. సౌమిత్ర ఖాన్, సుజాత మోండల్ 2010లో వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. పెళ్లి సమయంలో సౌమిత్రా ఖాన్‌ కాంగ్రెస్‌ పార్టీలో కీలక నేతగా ఉండేవారు. సుజాతా మోండల్‌ ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేసేవారు. 2019 లోక్ సభ ఎన్నికలకు ముందు సౌమిత్ర ఖాన్ కాంగ్రెస్‌ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీచేశారు. దాంతో అప్పుడు తన భర్త సౌమిత్రా ఖాన్ తరఫున ఆయన భార్య సుజాతా మోండల్‌ ప్రచారం కూడా చేశారు.

ఆ తర్వాత రెండేళ్లకు అంటే 2021లో సుజాతా మోండల్‌ కూడా రాజకీయాల్లోకి వచ్చారు. అయితే తన భర్త అభీష్టానికి వ్యతిరేకంగా ఆమె తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) పార్టీలో చేరారు. దాంతో ఆమె నిర్ణయాన్ని జీర్ణించుకోలేక పోయిన సౌమిత్రా ఖాన్‌.. తాను సుజాతతో వైవాహిక బంధాన్ని తెంచుకుంటున్నానని మీడియా ముఖంగా ప్రకటించారు. అప్పటి నుంచి భార్యాభర్తలిద్దరూ విడివిడిగానే ఉంటున్నారు.

ఈ నేపథ్యంలో ఇప్పుడు 2024 లోక్‌సభ ఎన్నికలు వచ్చాయి. విష్ణుపూర్‌ లోక్‌సభ స్థానం నుంచి భారతీయ జనతాపార్టీ సౌమిత్రా ఖాన్‌ను, తృణమూల్‌ కాంగ్రెస్ పార్టీ సుజాతా మోండల్‌ను రంగంలోకి దించాయి. దాంతో ఆ నియోజకవర్గంలో మాజీ భార్యభర్తలే ప్రధాన ప్రత్యర్థులుగా తలపడబోతున్నారు. అందుకే ఆ నియోజకవర్గం ఎన్నికపై ఇప్పుడు దేశమంతటా రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది.

Exit mobile version