Site icon vidhaatha

నాగార్జునసాగర్ ఎడమ కాలువ గండి పూడ్చండి: బీజేపీ ధర్నా.. అరెస్టులు

విధాత, నల్గొండ: నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నిడమనూరు మండలం ముప్పారం గ్రామం వద్ద పడిన గండి పూడ్చివేతలో ప్రభుత్వం అలసత్వాన్ని నిరసిస్తూ సోమవారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో
నిడమనూరు మండలం నర్సింహులగూడెం వద్ద 167వ జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు.

బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు ధర్నా నిర్వహించారు సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం కాల్వ గండి పూడ్చివేతలో ఆలస్యం చేస్తుండటంతో కాలువ కింద వేల ఎకరాల పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం సత్వరమే కాల్వ మరమ్మతులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

అలాగే కాలువ గండి వరద కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ,ఇండ్లు, సామాగ్రి నష్టపోయిన ప్రజలకు నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. అధికారుల నుండి స్పష్టమైన హామీ వచ్చేవరకు ఆందోళన విరమించమంటూ రహదారిపై బైఠాయించడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు.

ఈ సందర్భంగా ఇరు వర్గాలకు కొద్దిసేపు తోపులాట సాగింది. పోలీసులు బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాధగోని శ్రీనివాస్ గౌడ్‌ను, జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి , నివేదితతో పాటు ఇతర నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కి తరలించారు.

Exit mobile version