Telangana | విభజన ‘హామీల్లో’ కేంద్రం విఫలం

రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణకు రావాల్సిన హామీలు అమలు చేయడంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు పూర్తిగా విఫలమైంది

  • Publish Date - April 15, 2024 / 03:10 PM IST

అటకెక్కిన పార్లమెంట్ హామీ
దశాబ్ద నిర్లక్ష్యానికి బాధ్యులెవరూ?
కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం
రాష్ట్ర బీజేపి నేతల పైన విమర్శలు
బీఆర్ఎస్ తీరుపై ఆరోపణలు
ఎన్నికల నేపథ్యంలో ఎజెండా

విధాత ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణకు రావాల్సిన హామీలు అమలు చేయడంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు పూర్తిగా విఫలమైంది. పార్లమెంటులో ప్రకటించిన ఈ హామీలు దశాబ్దకాలం పూర్తైయినా అమలుకునోచుకోలేదు. కాలపరిమితి ముగిసినందున ఈ హామీలు అటకెక్కినట్లేనా? అనే అనుమానం వ్యక్తమవుతోంది. విభజన హామీల అమలుపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పదేళ్లుగా కనబరుస్తున్న నిర్లక్ష్యంపై విపక్షపార్టీలు కన్నెర్ర చేస్తున్నాయి.

పార్లమెంట్ ఎన్నికల వేళ ఎజెండాగా మారి తెలంగాణ ప్రజలకు ఆయుధంగా మారనున్నది. ఇప్పుడిప్పుడే ఈ డిమాండ్ మరోసారి తెరపైకి వస్తోంది. రానున్న రోజుల్లో బీజేపీని నిలదీస్తూ ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది. విభజన హామీలకే దిక్కులేదంటూనే, పదేండ్ల పాలనలో రాష్ట్రానికి ఒరిగిందేమీలేదంటున్నారు. ప్రచారం సందర్భంగా బీజేపీకి ఈ అంశం ఇబ్బందిగా మారనున్నది. దశాబ్దకాలం అధికారంలో ఉండి అమలు చేయని బీజేపీ కొత్తగా తెలంగాణకు ఒరగబెట్టేదేమీలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఈ విమర్శలు రాష్ట్రంలో బీజేపీ పురోగతికి అడ్డంకిగా మారుతోందని ఆ పార్టీ నేతల్లో అప్పుడే ఆందోళన ప్రారంభమైంది. తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ అంశాన్ని కరీంనగర్ వేదికగా లేవనెత్తారు. ఇదే అంశంపై ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. విభజన హామీల్లో మూడు ముఖ్యమైనవి ఈ జిల్లా ప్రగతికి, పురోభివృద్ధికి దోహదం చేసేవి అయినందున కొంత ఈ జిల్లాలో సెంటిమెంటుగా మారింది. పదేళ్ళుగా జిల్లాలో వివిధ రూపాల్లో ఈ అంశాన్ని అన్ని రాజకీయ పక్షాలు లేవనెత్తుతున్నాయి.

రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా, కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి, ఆ పార్టీ ఎంపీలైన బండి సంజయ్, లక్ష్మణ్, అర్వింద్, సోయంబాపురావులు ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర బీజేపీ నేతలు తెలంగాణ ప్రయోజనాలు కేంద్రం ముందు తాకట్టుపెట్టారనే ఆరోపణలున్నాయి. ఒకరిద్దరు తప్ప ఈ నాయకులంతా ఈ ఎన్నికల్లో పోటీ నిలవడం ఇప్పుడు పరీక్షగా మారింది. బీజేపితో పాటు నిన్నటి వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆరెస్ ఈ హామీలు సాధించడంలో వైఫల్యం చెందిందనే విమర్శలున్నాయి. మొన్నటి వరకు ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ రాష్ట్రంలో అధికార పార్టీగా మారినందున ఏ మేరకు సాధిస్తుందోననే చర్చ ఉంది.

విభజన హామీల్లో కేంద్రం వైఫల్యం

విభజన హామీల్లో అనేక అంశాలున్నాయి. రాష్ట్ర పురోగతితో ముడిపడి ఉన్నాయి. ఇందులో మూడు ప్రధాన డిమాండ్లు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినవి కావడం గమనార్హం. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు, ములుగులో గిరిజన యూనివర్సిటీ, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం విభజన హామీలల్లో ఉమ్మడి జిల్లాకు చెందినవి ఉన్నాయి.

కోచ్ ఫ్యాక్టరీని అటకెక్కించి మోదీ వ్యాగన్ వీల్ ఫ్యాక్టరీని తెరపైకి తెచ్చి జిల్లా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నంచేసినప్పటికీ ఎవరూ అంగీకరించలేదు. ఇటీవల గిరిజన యూనివర్సీటీకి అనుమతించారు. రాష్ట్ర ప్రభుత్వం 331 ఎకరాల భూమిని కేటాయించగా, కేంద్రం పదేండ్లు పండబెట్టి ఎన్నికల సందర్భంగా ప్రకటనలు చేశారు. ఉక్కు పరిశ్రమను తుక్కులో చేర్చారు.

ప్రాజెక్టుకు జాతీయ హోదా

తెలంగాణలో ఒక నీటిపారుదల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని స్పష్టంగా ఉన్నది. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల్లో దేనికి జాతీయ హోదా ప్రకటించలేదు. కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీటి వాటాలను ఇంకా తేల్చలేదు. తాత్కాలిక కేటాయింపులనే ఇప్పటికీ కొనసాగిస్తున్నందున తెలంగాణకు నష్టం వాటిల్లుతోంది. తెలంగాణకు సగం వాటా రావాల్సి ఉండగా పరిష్కారం పదేండ్లుగా పడకేసింది.

 

వెనుకబడిన జిల్లాలకు నిధులు

రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఏటా రూ.450 కోట్లు ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. తొమ్మిదేండ్లలో కేవలం నాలుగేండ్లకు మాత్రమే నిధులు ఇచ్చింది. ఇంకా 2014-15, 2019-20, 2021-22, 2022-23కు సంబంధించిన ఐదేండ్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. షెడ్యూల్‌ 9, 10 లోని సంస్థల విభజన తొమ్మిదేండ్లయినా ఎటూ తేలలేదు. చర్చలు, కమిటీలు, కాలయాపనలు తప్ప ఒరిగిందేమీ లేదు.

2014-15లో తెలంగాణకు రావాల్సిన సీఎస్‌ఎస్‌ నిధులు రూ.495 కోట్లు వెనక్కిరాలేదు. ఐటీఐఆర్‌ను పథకాన్ని రద్దు చేశారు. సాఫ్ట్ వేర్‌ టెక్నాలజీ పార్కుల్లో వివక్ష, వైద్య కళాశాలలు, నవోదయ, ఐఐఎం లాంటి విద్యా సంస్థలను కేటాయించడంలో నిర్లక్ష్యం వహించారు. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపిలో ఏకపక్షంగా కలిపారు.

వైఫల్యానికి మోదీదే బాధ్యత

విభజన హామీల వైఫల్యానికి ప్రధాని మోదీని రాష్ట్ర రాజకీయ పక్షాలు టార్గెట్ చేస్తున్నాయి. హామీల అమలులో ప్రధానిగా నిర్లక్ష్యం చేసినందున ఆ పార్టీకి వ్యతిరేకంగా మారనున్నది. ఎన్నికల నేపథ్యంలో విభజన హామీలు మరోసారి ఎజెండాపైకి వచ్చాయి. ప్రజలను వంచించిన బీజేపీ ఇప్పుడు ఏ మొఖం పెట్టుకుని ప్రజల వద్దకు వస్తుందని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్ తదితరులు మౌన ప్రేక్షపాత్ర వహిస్తున్నారని విమర్శిస్తున్నారు.

బీఆర్ఎస్ తీరు పై విమర్శ

పదేండ్ల పాలనలో బీఆర్ఎస్ ఎనిమిదేళ్ళు బీజేపీతో అంటకాగి విభజన హామీలు సాధించడంలో విఫలమయ్యారు. చివరి రెండేండ్ల మాత్రమే బీజేపీని బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఎన్నికలొచ్చినపుడు ఎజెండా మార్చి ఆ తర్వాత కోల్డ్ స్టోరేజీలో పెట్టడం తప్ప చేసిందేమీలేదు.

కాంగ్రెస్ పై పెరిగిన బాధ్యత

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినందున కాంగ్రెస్ కేంద్రంపై ఒత్తిడితేవాలని కోరుతున్నారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ స్పష్టతనివ్వాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

విపక్ష పార్టీల విమర్శ

విభజన హామీల అమలు కాలపరిమితి ముగిసినందున భవిష్యత్తులోనేనా అమలు చేస్తారా? లేదా? అనే గ్యారంటీ పోయింది. రాష్ట్ర అభివృద్ధి, ఉపాధికి దోహదం చేసే ఈ ప్రధాన హామీలిప్పుడు త్రిశంకు స్వర్గంలో ఉన్నాయి. వీటిపట్ల నిర్లక్ష్యం చేసిన బీజేపీని ఎన్నికల్లో ప్రశ్నించాలని విపక్షాలు భావిస్తున్నాయి.బీజేపీ రాష్ట్ర నేతలు మౌనం వహించడం వల్ల కూడా నష్టంవాటిల్లిందంటున్నారు. హామీలు అమలుచేయని బీజేపిని క్షేత్ర స్థాయిలో నిలదీయాలని పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి.

బి ఆర్ ఎస్, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, సి పిఐ ఎంఎల్ పార్టీలతోపాటు ప్రజాసంఘాల నాయకులు విభజన హామీలపై ప్రశ్నిస్తున్నారు. హామీలు అమలు చేయకుండా ప్రజలను వంచింస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ ముఖం పెట్టుకొని ప్రధాని ఓట్లు అడుగుతారని, ఇప్పటికైనా విభజన హామీల పట్ల స్పష్టమైన ప్రకటన చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

Latest News