Amit Shah | తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే.. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దే దించేది మేమే: అమిత్ షా

Amit Shah | రహస్య పొత్తు పేరుతో కాంగ్రెస్ అబద్ధాల ప్రచారం భద్రాద్రి రాముడిని కేసీఆర్ అవమానించారు తెలంగాణకు కేంద్రం దండిగా నిధులు తెలంగాణ విమోచన పోరాట అమరులను అవమానించారు ఖమ్మం సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ధ్వజం విధాత : తెలంగాణలో రానున్న ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేది బీజేపీ మాత్రమేనని, ప్రధాని నరేంద్రమోడీ ఆశీస్సులతో అధికారంలోకి వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ధీమా […]

  • Publish Date - August 27, 2023 / 03:45 PM IST

Amit Shah |

  • రహస్య పొత్తు పేరుతో కాంగ్రెస్ అబద్ధాల ప్రచారం
  • భద్రాద్రి రాముడిని కేసీఆర్ అవమానించారు
  • తెలంగాణకు కేంద్రం దండిగా నిధులు
  • తెలంగాణ విమోచన పోరాట అమరులను అవమానించారు
  • ఖమ్మం సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ధ్వజం

విధాత : తెలంగాణలో రానున్న ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేది బీజేపీ మాత్రమేనని, ప్రధాని నరేంద్రమోడీ ఆశీస్సులతో అధికారంలోకి వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మంలో బీజేపీ నిర్వహించిన రైతు గోస..బీజేపీ భరోసా బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తు సీఎం కేసీఆర్ ప్రభుత్వంపైన, కాంగ్రెస్‌, ఎంఐఎంలపైన నిప్పులు చెరిగారు.

తెలంగాణలో రజాకార్ల మద్దతుతో కొనసాగుసతున్న అవినీతి, కుటుంబ పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి నూకలు చెల్లాయని చెప్పడానికే తాను ఖమ్మంకు వచ్చానన్నారు. సెప్టెంబర్ 17తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకుండా రజాకార్ల పార్టీ ఎంఐఎంతో అంటకాగుతున్న సీఎం కేసీఆర్‌ తెలంగాణ విమోచన పోరాట అమరులను అవమానిస్తున్నారన్నారు.

కారు స్టీిరింగ్ ఎంఐఎం పార్టీ అధినేత ఓవేసీ చేతిలో ఉందని, కారు భద్రాచలం వస్తుందిగాని రాముడి వద్దకు మాత్రం రావడం లేదన్నారు. దక్షిణ అయోధ్యగా పేరోందిన భద్రాచలంలో భక్తరామదాసు రామమందిర నిర్మాణం కోసం జైలుపాలయ్యాడన్నారు. 17వ శతాబ్ధం నుంచి శ్రీరామా నవమి రోజున రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు భద్రాచల రాముడికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని సీఎం కేసీఆర్ ఆ సాంప్రదాయాన్ని విస్మరించి భద్రాద్రి రాముడిని, భక్తుల మనోభావాలను అవమానించాడని విమర్శించారు.

కారు రామమందిరంలోకి వెళ్లితే కేసీఆర్ మిత్రుడు ఓవైసీ బాధ కల్గుతుందన్నారు. ఇక ముందు సీఎం కేసీఆర్ భద్రాచలం రానవసరం లేదని, రేపు తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమని, మా పార్టీ ముఖ్యమంత్రి కమలం పుష్పాన్ని రాముడి పాదపద్మముల ముందు అర్పిస్తారన్నారు.

తెలంగాణలో కేసీఆర్ అవినీతిపై పోరాటాలు చేస్తున్న బీజేపీ శ్రేణులపై కేసులు పెట్టి నిలువరించాలని చూస్తున్నాని, కిషన్‌రెడ్డిని అరెస్టు చేశారని, బండి సంజయ్ పై కేసులు పెట్టారని, ఈటల రాజేందర్‌ను అసెంబ్లీలో అడ్డుకున్నారన్నారు. అయినా బీజేపీ వెనక్కి తగ్గేది లేదన్నారు. నీవు, నీ కొడుకు కేటీఆర్‌లు తెలంగాణలో ఇక ముఖ్యమంత్రులు అయ్యే ప్రసక్తి లేదన్నారు.

ఎంఐఎం మిత్రుడైన బీఆరెస్‌తో బీజేపీ ఎన్నిటికి కలవదు

కాంగ్రెస్ పార్టీ గాంధీల పాలనతో 4జీ, బీఆరెస్ 2జీ, ఎంఐఎం 3జీ పార్టీగా మారాయని, ఇప్పుడు 4జీ, 2జీ, 3జీలకు కాలం చెల్లిందని, ఇక వచ్చేది తెలంగాణలో బీజేపీ పార్టీయేనన్నారు. మళ్లీ ఎన్నికలు రాగానే కేసీఆర్‌ పేదలకు ఇండ్లు, స్థలాలు, యువతకు ఉద్యోగాలు, దళితలకు దళిత బంధు పేరుతో, రైతులకు రుణమాఫీ పేరుతో ఎన్నికల వేళ మోసం చేసేందుకు అబద్ధపు హామీలిస్తున్నాడన్నారు.

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే తెలంగాణకు వచ్చి ఎన్నికల తర్వాతా బీఆరెస్‌, బీజేపీ రెండు ఒకటేనంటున్నాయన్నారు. కేసీఆర్ గుర్తు పెట్టుకోవాలని ఏం జరిగినా ఓవైసీ తో బీజేపీ వేదిక పంచుకోబోదని, అలాంటప్పుడు ఎంఐఎంతో అంటకాగే బీఆరెస్‌తో బీజేపీ ఎలా కలుస్తుందని, వారితో ప్రభుత్వం ఎలా ఏర్పాటు చేస్తుందంటు అమిత్‌షా ప్రశ్నించారు.

తెలంగాణ యువత, సమాజం దీనిపై ఆలోచించాలన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో యూపీఏ ప్రభుత్వం 2లక్షల కోట్ల నిధులు ఇస్తే, మోడీ ప్రభుత్వం ఒక్క తెలంగాణకే 2.80లక్షల కోట్ల నిధులిచ్చిందన్నారు. 33లక్షల మంది పేదలకు మరుగుదొడ్లు నిర్మించామన్నారు. 2.5లక్షల మంది పేదలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామన్నారు. కాంగ్రెస్ పార్టీ 22వేల కోట్ల బడ్జెట్ పెడితే మోడీ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం 1లక్ష 25వేల కోట్ల బడ్జెట్ పెట్టిందన్నారు.

రైతులకు కాంగ్రెస్ 7లక్షల కోట్ల రుణాలు ఇస్తే తొమ్మిదేళ్లలో మోడీ ప్రభుత్వం 25లక్షల కోట్లు రైతాంగానికి ఖర్చు చేసిందన్నారు. 9లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కేంద్రం కొనుగోలు చేస్తే కేసీఆర్ దీనిపై కూడా రాజకీయ చేశారన్నారు. పంట మద్దతు ధర ఎంఎస్‌పీ 66శాతం పెంచిందన్నారు. 2,183కోట్ల రూపాయలను ధాన్య కొనుగోలుకు వెచ్చిస్తుందన్నారు. 11కోట్ల రైతుల కోసం ప్రధాని సమ్మాన్ నిధి కింద 2లక్షల 60వేల కోట్లను అందిస్తుందన్నారు.

రైతు వ్యతిరేక, దళిత, మహిళా, యువత వ్యతిరేక కేసీఆర్ ప్రభుత్వాన్ని కూకటి వ్రేళ్లతో పెకిలించాలని అమిత్‌షా్ పిలుపునిచ్చారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపి బీజేపీని అధికారంలోకి తీసుకొద్దామన్నారు. సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షురాలు డికే.అరుణ, ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌కుమార్‌, ఇంచార్జీ తరుణ్ చుగ్‌, ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్‌, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్ పాలనలో వ్యవసాయం సబ్సిడీలకు కోత: కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ధ్వజం

విధాత : సీఎం కేసీఆర్ పాలనలో రైతుబంధు ముసుగులో వ్యవసాయ సబ్సిడీలకు కోతలు పడి రైతాంగం సంక్షోభంలో పడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఖమ్మంలో బీజేపీ నిర్వహించిన రైతు గోస..బీజేపీ భరోసా బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ తెలంగాణ రైతుల గోసను చాటి. వారికి బీజేపీ తరుపునా భరోసానిచ్చేందుకు ఈ సభ తలపెట్టామన్నారు.

తెలంగాణలో, బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో వ్యవసాయం దండుగ అన్నట్లు మారింది. రైతన్నలు అన్నిరకాలుగా దగా పడుతున్నారు. రైతులకు పంట నష్టపరిహారం, పంట బీమా లేదన్నారు. వ్యవసాయ సబ్సిడీలు పూర్తిగా ఆగిపోయాయన్నారు. వ్యవసాయ రుణాలమీద పావలా వడ్డీలేదన్నారు. ఉచిత ఎరువులు, విత్తనాలు ఆగిపోయాయన్నారు.

రైతాంగంలో 75 శాతం కౌలు రైతుల చేతుల్లోనే ఉందని వారి సంక్షమానికి ఒక్క పథకం అమలు కావడం లేదన్నారు. ఇవాళ తెలంగాణను సీడ్ బౌల్ చేస్తామని చెప్పి.. వారి కుటుంబానికి తెలంగాణను గోల్డెన్ బౌల్ గా మార్చుకున్నారన్నారు. రైతు రుణమాఫీ నాలుగున్నరేండ్లు మరిచిపోయి ఎన్నికల ముందు తూతూ మంత్రంగా అమలు చేయాలన్న నాటకాలు చేస్తున్నారని ఆరోపించారు.

దీంతో రైతుల అప్పులకు వడ్డీ పెరిగిపోయి రుణమాఫీ వడ్డీకి చాలడం లేదన్నారు. రాష్ట్రంలో రైతుల, కౌలు రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు కమిషన్ల ప్రాజెక్టులుగా మారాయి తప్ప.. రైతులకు ఒరిగిందేమీ లేదన్నారు. కొండనాలుకకు మందేస్తే.. ఉన్ననాలుక ఊడినట్లుగా..
ఉన్న సమస్యలు చాలవని.. ధరణి ద్వారా రైతులకు, ప్రజలకు మరిన్ని సమస్యలను సీఎం కేసీఆర్ పెంచాడన్నారు.

బీజేపీ అధికారంలోకి రాగానే రైతు సమస్యలను పరిష్కరించే దిశగా మేం పూర్తిస్థాయిలో రైతుల పక్షాల నిలబడి బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపిస్తామన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు ప్రత్యామ్నాయంగా బీజేపీకి అధికారాన్ని అందించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ సోనియా కుటుంబం కోసం పనిచేస్తే, బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కుటుంబం కోసం పనిచేస్తోందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ, మజ్లిస్ ఒకే గూటి పక్షులని, బీఆరెస్‌కు ఒటేస్తే కాంగ్రెస్ కు వేసినట్లేనన్నారు. తెలంగాణ అమరవీరుల ఆకాంక్షల సాధన మోడీ ఆశీస్సులతో వచ్చే బీజేపీతో మాత్రమే సాధ్యమన్నారు.

ఎన్నికల వేళ మరోసారి మోసపూరిత హామీలు : ఈటల రాజేందర్‌

అబ్ కీ బార్ కిసాన్ సర్కారు కేసీఆర్ మాట చెప్పి నాలుగున్నర సంవత్సరాలుగా రైతులకు ఇచ్చిన భరోసాను పూర్తిచేయలేదని బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ విమర్శించారు. ఇవాళ ఎన్నికలు వేళ రైతులను మోసం చేసేందుకు కొత్త మాటలు చెబుతున్నాడన్నారు. రైతాంగానికి గతంలో అనేక సబ్సిడీలు వచ్చేవని, ఇవాళ అవన్నీ ఎత్తేసి, ఒక్క రైతు బంధు ఇస్తూ మిగిలిన అన్నీసబ్సిడీలు దోచేస్తున్నాడన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తరుగులేకుండా ధాన్యం కొంటామని, రైతుల హక్కుగా అందాల్సిన అన్ని సబ్సిడీలు అందిస్తామన్నారు.

మోదీ గారి నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి రాగానే పేదలకు ఇండ్లు, స్థలాలు అందిస్తామన్నారు. మోడీ ప్రభుత్వం దేశంలో 3.50కోట్ల ఇండ్లు కట్టిస్తే తెలంగాణలో డబుల్ బెడ్ రూమ్‌లు ఇస్తామని చెప్పిన కేసీఆర్ తొమ్మిదిన్నరేళ్లలో 30వేలు కట్టించారన్నారు. ఎన్నికలొచ్చాయని అవుటర్ రోడ్డును, ప్రభుత్వ భూములను అమ్మి రుణమాఫీ పేరుతో కేసీఆర్ మళ్లీ మోసం చేయచూస్తున్నాడన్నారు. కేసీఆర్ పాలనలో ఉద్యోగులు, మహిళలు, రైతులు, దళిత, గిరిజన, బడుగు వర్గాలన్ని ఇబ్బంది పడుతున్నాయన్నారు. ఇప్పటిదాకా బీఆరెస్‌, కాంగ్రెస్ పాలన చూశారని ఈ దఫా బీజేపీకి అవకాశమివ్వాలని కోరారు.

ఎన్నికలోస్తే కేసీఆర్‌కు ప్రజలు గుర్తుకొస్తారు :బండి సంజయ్‌కుమార్‌

ఎన్నికలొస్తేనే సీఎం కేసీఆర్‌కు పేదలకు ఇండ్లు, రైతులకు రుణమాఫీ, ఉద్యోగాలు గుర్తుకొస్తాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌కుమార్ విమర్శించారు. కేసీఆర్ దొంగ దీక్షను బయటపెట్టిన చరిత్ర మీ ఖమ్మం ప్రజలదని, కేసీఆర్ పేరు దుబాయ్ శేఖర్ అని, పేదలను దుబాయ్ తీసుకపోతనని చెప్పి మోసం చేసిన వ్యక్తి కేసీఆర్ అని బండి విమర్శించారు. కొడుకు పేరును మార్చి కల్వకుంట్ల తారక రామారావు అని చెప్పి నాటకాలు ఆడిన మనిషి కేసీఆర్ కు మోసం చేయడం బాగా తెలుసన్నారు.

బీఆరెస్‌, కాంగ్రెస్‌లో లోపాయికారి ఒప్పందంతో పనిచేస్తూ ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. పెగ్గు పెగ్గుకొక కొత్త హామీ ఇస్తు అన్ని మరిచిపోవడం కేసీఆర్‌కు అలవాటైందన్నారు. అందుకే తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం డబుల్ ఇంజన్ సర్కార రావాలన్నారు. నరేంద్రమోదీ నేతృత్వంలో అమిత్ షా గారి మార్గదర్శకత్వంలో తెలంగాణలో బీజేపీ రామారాజ్యం అధికారంలోకి రావాలన్నారు. ఇందుకోసం తెలంగాణ ప్రజలంతా సహకరించాలని కోరారు.

Latest News