- ఒకపక్క పెద్దన్న అంటూనే విమర్శలా?
- కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డే ఏక్‌నాథ్ షిండే
- బీజేపీ నేత డీకే అరుణ విమర్శలు
మహబూబ్‌నగర్ : మోదీని ఒక పక్క పెద్దన్న అంటూనే ఆ మరుసటి రోజే మోదీ – కేడీ అనడం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుసంస్కారానికి నిదర్శనమని బీజేపీ నేత డీకే అరుణ అన్నారు. బుధవారం నాటి సభలో రేవంత్ టీమ్ మాట్లాడింది చూస్తుంటే సంక్రాంతి గంగిరెద్దులు గుర్తొస్తున్నాయని ఎద్దేవా చేశారు. రేవంత్ సర్కారును పడగొట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పడం సానుభూతి కోసమేనని ఆమె స్పష్టం చేశారు. గురువారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. మీ పాలనపై మీకే నమ్మకం లేక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు.
కాంగ్రెస్ నుంచి ఎవరైనా మరో ఏక్‌నాథ్ షిండేలా 40 మంది ఎమ్మెల్యేలతో పార్టీని చీల్చితే అప్పుడు పడిపోతుందేమోనన్న అరుణ.. రేవంత్‌రెడ్డే ఆ ఏక్‌నాథ్ షిండే అవ్వొచ్చన్న విమర్శలు వినిపిస్తున్నాయని చెప్పారు. గతంలో కేసీఆర్ కూడా ఇలా అహంకార పూరిత వ్యాఖ్యలు చేశారని, ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నరో చూడాలని అన్నారు. 60 ఏళ్ళు దేశంలో అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్పాలని అరుణ నిలదీశారు. రేవంత్‌కు దమ్ముంటే ఇచ్చిన అరు గ్యారంటీలు అమలు చేసి చూపాలని సవాలు చేశారు. మోదీ గురించి మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదన్నారు.
అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే అహంకారం వచ్చిందని మండిపడ్డారు. మొన్న మోదీని కలిసిన అపవాదును తొలగించుకునేందుకు రాజకీయ విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. పాలమూరుకు 60% నిధులు ఇస్తామని చెప్పినా మళ్ళీ ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు. కాళేశ్వరం పై ఇప్పటివరకు ఎందుకు సీబీఐ ఎంక్వయిరీ కోరలేదని నిలదీశారు. కేసీఆర్‌తో కుమ్మక్కయ్యే మేడిగడ్డపై సీబీఐ విచారణ జరిపించడం లేదా? అని ప్రశ్నించారు. తెలంగాణలో 12 పార్లమెంట్ స్థానాలు బరాబర్ గెలుస్తామని అరుణ ధీమా వ్యక్తం చేశారు.