Site icon vidhaatha

కాళేశ్వరం అవినీతిపై చర్యలేవి

విధాత, హైదరాబాద్ : కాళేశ్వరం అవినీతిపై చర్చలు తప్ప సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని మాజీ ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం అవినీతిని వదిలేసి మేడిగడ్డను పట్టుకోవడం వెనుక మతలబు ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతల మాటలను ఆ పార్టీ హైకమాండ్ వినడం లేదని, కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నేతలు అంటున్నప్పటికి కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ఒప్పుకోవడం లేదన్నారు.


కాంగ్రెస్ ప్రభుత్వమే బీఆరెస్‌ను కాపాడుతోందని ఆరోపించారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, బీఆరెస్‌తో ఏలాంటి పొత్తులు ఉండవని స్పష్టం చేశారు. తనకు చేవెళ్ళ టికెట్ వచ్చినా రాకపోయినా పార్టీ కోసం పనిచేస్తానని.. టికెట్ ఇస్తామని తనకు కూడా ఎవరూ ఎలాంటి గ్యారెంటీ ఇవ్వలేదని కొండా విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ వాళ్ళు రాహుల్ గాంధీకి ఓటేయాలని అడగలేరని, ఆయన పేరును ప్రధాని అభ్యర్థిగా చెప్పలేనన్నారు.


తెలంగాణలో బీజేపీకి ఎక్కువ సీట్లు గెలిపిస్తే నిధులు తెచ్చుకునే అవకాశం ఉంటుందన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిస్తే కాంగ్రెస్‌లో చేరతున్నారని దుష్ప్రచారం చేశారని, మరి ఢిల్లీకి వెళ్లి సీఎం, మంత్రులు మోదీని కలిస్తున్నారని, వారు కూడా బీజేపీలో చేరతారా? అని ప్రశ్నించారు. కొత్త ప్రభుత్వం చేతిలో బీఆరెస్‌ సర్కార్ చిప్ప పెట్టిపోయిందని, ఎఫ్ఆర్‌బీఎం పరిధి మించిపోయినా కొత్తగా అప్పు తీసుకునేందుకు తెలంగాణకు మోడీ అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు.


రాష్ట్రం ఆర్థికంగా నడుస్తోందంటే కారణం ప్రధానేనని, పార్లమెంట్ ఎన్నికల్లో మోడీకి ఓటేయాలని మేము గర్వంగా అడుగుతామన్నారు. గ్రామీణ అభివృద్ధి కూడా మోదీ వల్లనే జరుగుతోందని, రూ. 9 వేల కోట్ల అప్పు ఇవ్వలేకపోతే రాష్ట్రం చీకట్లోకి వెళ్ళేదని కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. 65 శాతం మంది ముస్లింలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పథకాలతో లబ్ది చేకూరుతుందని వారు కూడా మోడీ పాలన పట్ల సానుకూలంగా ఉన్నారన్నారు.

Exit mobile version