విధాత : ఉత్తరాఖండ్ పౌరి జిల్లాలోని రిషికేష్ సమీపంలో బీజేపీ నాయకులు వినోద్ ఆర్య కుమారుడు పుల్కిత్ ఆర్య ఓ రిసార్ట్ నిర్వహిస్తున్నాడు. ఈ రిసార్ట్‌లో పని చేసే రిసెప్షనిస్ట్ దారుణ హత్యకు గురైంది. ఈ కేసులో రిసార్ట్ ఓనర్ పుల్కిత్ ఆర్య, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. బీజేపీ నాయకులు వినోద్ ఆర్య కుమారుడు పుల్కిత్ ఆర్యకు చెందిన రిసార్ట్‌లో ఓ 19 ఏండ్ల యువతి రిసెప్షనిస్ట్‌గా పని చేస్తోంది. అయితే ఆమె గత సోమవారం అదృశ్యమైంది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పట్టించుకోలేదు. అయితే యువతిని రిసార్ట్ యజమానులే చంపేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఇక క్షణాల్లోనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
యువతి మృతదేహాన్ని రిసార్ట్‌కు సమీపంలోని ఓ చెరువులో కనుగొన్నారు. అయితే రిసెప్షనిస్ట్ హత్యకు గురైనట్లు తేలడంతో, రిసార్ట్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ హత్యలో పుల్కిత్ ప్రమేయం కూడా ఉండటంతో.. అతన్ని అరెస్టు చేశారు.
ఈ ఘటనపై ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ పుష్కర్ సింగ్ ధామి స్పందించారు. యువతిని హత్య చేయడం దారుణమన్నారు. ఈ కేసులో ఎవర్నీ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. ఇది క్రూరమైన చర్య. ఈ ఘటన జరగడం చాలా బాధాకరమన్నారు. ఇలాంటి ఘటనలను సహించం అని సీఎం తేల్చిచెప్పారు.
ఇక బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పుల్కిత్‌కు బీజేపీ, ఆర్ఎస్ఎస్‌తో సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. యువతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రిసెప్షనిస్ట్ సెప్టెంబర్ 18న అదృశ్యమైతే, 21న ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఏంటని ప్రశ్నించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.